Uma Bharti: రాముడు, హనుమంతుడిపై "భక్తికి" బీజేపీ కాపీ రైట్స్ తీసుకోలేదు - ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు
Uma Bharti: రాముడిపై భక్తికి బీజేపీకి మాత్రమే కాపీరైట్స్ లేవని ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Uma Bharti:
ఉమా భారతిపై బీజేపీ అసహనం..
బీజేపీ నేత ఉమా భారతి చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. రాముడు, హనుమంతుడు భక్తికి బీజేపీ కాపీరైట్స్ తీసుకోలేదంటూ చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అంతకు ముందు రోజు మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు ఉమా భారతి. "అంతా ఆలోచించండి. మీకు నచ్చి పార్టీకే ఓటు వేయండి" అని ఓటర్లతో అన్నారు. దీనిపైనా బీజే నేతలు అసహనంతో ఉన్నారు. తన పార్టీకి ఓటు వేయాలని చెప్పటానికి బదులుగా...ఏ పార్టీకైనా వేయండి అని ఎలా అంటారంటూ మండి పడుతున్నారు. ఇదే వివాదమవుతుంటే...ఇప్పుడు రాముడు, హనుమంతుడిపైన చేసిన కామెంట్స్ బీజేపీ నేతలకు మరింత ఆగ్రహం కలిగిస్తున్నాయి. అసలు ఆమె ఎందుకీ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే...కాంగ్రెస్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తాము అధికారంలోకి వస్తే
హనుమాన్ ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఉమా భారతిని ప్రశ్నించగా..."రాముడు, హనుమంతుడుపై భక్తి అనేది బీజేపీకి మాత్రమే చెందింది కాదు. కాపీరైట్ తీసుకోలేదు" అని ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ కీలక నేతగా ఉన్న ఆమె...ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని పలువురు ఆశ్చర్యపోతున్నారు. లోధి కమ్యూనిటీకి చెందిన ఆమె ఆ వర్గ ప్రజలను ఓటు అడిగే సమయంలోనూ "మీ ఇష్టమైన పార్టీకే ఓటు వేయండి" అన్నారు. "మీకు నాకు మధ్య బంధం ఎప్పుడూ ఉంటుంది. కానీ..రాజకీయ పరంగా చూస్తే మాత్రం మీ స్వేచ్ఛ మీకు ఉంటుంది. మీ అంతట మీరు ఆలోచించుకోండి. ఎవరికి ఓటు వేయాలి అనిపిస్తే వారికే వేయండి"
అని స్పష్టం చేశారు ఉమా భారతి. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు మొదలు పెట్టింది. "బీజేపీకి ఓటు వేయాల్సిన పని లేదని లోధి కమ్యూనిటీ ప్రజలకు ఉమా భారతి చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మీకు స్వాగతం" అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
గతంలో ఫరూక్ అబ్దుల్లా..
గతంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ బీజేపీ "హిందువులు చాలా ప్రమాదకర స్థితిలో జీవిస్తున్నారు" అంటూ ప్రచారం చేస్తుంటారని, ఈ మాయ మాటలు నమ్మి మోసకూడదని సూచించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రాముడు అందరివాడు. ఆయనను హిందూ మతానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు" అని వెల్లడించారు. ఏ మతమూ చెడు నేర్పించదని, ప్రజలే అలా తయారవుతారని తెలిపారు. "మాపై నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కానీ మేమెప్పుడూ పాకిస్థాన్ సైడ్ తీసుకోలేదు. వారితో ఎప్పుడూ స్నేహం చేయలేదు. మా నాన్నను కలవడానికి జిన్నా వచ్చారు. కానీ మేము కనీసం ఆయనకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు" అని తేల్చి చెప్పారు. ఇలా ఏదో విధంగా పలువురు నేతలు బీజేపీ సిద్ధాంతాలపై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. ఒక్కోసారి సొంత పార్టీ నేతలూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటమే సంచలనమవుతోంది.
Also Read: Pant Car Accident: పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్