Top Headlines Today: ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు; ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జిషీట్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో తరలివెళ్లారు. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు.. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఆసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా చదవండి
'బీఆర్ఎస్ తప్పులన్నీ బయటపెడతా' - రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలను తీసేసిందని.. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందని నకిరేకల్ (Nakirekal) ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam) మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన అసెంబ్లీలో ప్రతిపాదించగా.. దీన్ని మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennem Srinivas Reddy) బలపరిచారు. ఈ సందర్భంగా వేముల వీరేశం బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతాం. బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని చూసి బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు.?' అని ఆయన నిలదీశారు. ఇంకా చదవండి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జిషీట్
అమరావతి(Amaravathi) రింగ్ రోడ్డు కేసులో విజయవాడ ఏసీబీ(ACB_ కోర్టులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఏ-1గా చంద్రబాబు(CBN), ఏ–2గా నాటి పురపాలక మంత్రి పొంగూరి నారాయణ(Narayana)లను చేర్చింది. ఈకేసులో ఏ-14గా నారాలోకేశ్(Lokesh) తోపాటు పాటు లింగమనేని రమేశ్ పేర్లను ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఇంకా చదవండి
తుది అంకానికి ఆడుదాం ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా' తుది పోటీలకు విశాఖ సిద్ధమైంది. మొత్తం 14,997 గ్రామాల నుంచి మహిళలు, పురుషుల జట్లు ఐదు క్రీడల్లో నిర్వహిస్తున్న పోటీల్లో తమ సత్తా చాటేందుకురెడీ అయ్యాయి. 50 రోజుల పాటు సాగనున్న ఈ పోటీల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయి చివరి దశ కు చేరుకున్నాయి. మొత్తం 37.5 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నేటి నుంచి(శుక్రవారం)చివరిదైన ఐదో దశ రాష్ట్ర స్థాయి పోటీల్లో 26 జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు విశాఖలో అమీతుమీ తేల్చుకుంటాయి. ఇంకా చదవండి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఎం రేవంత్ ను దూషించిన వ్యవహారంలో ఆయనపై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, గత రెండు రోజులుగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా చదవండి