Ram Janmabhoomi Complex: అయోధ్య రామ జన్మభూమిపై కుట్ర, పేల్చేస్తామంటూ స్థానికుడికి ఆగంతకుడి ఫోన్ కాల్
Ram Janmabhoomi Complex: రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామని స్థానికుడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు.
Ram Janmabhoomi:
అలెర్ట్ అయిన పోలీసులు..
అయోధ్య రామ మందిరాన్ని పేల్చే కుట్ర జరిగే ప్రమాదముందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో పోలీసులూ అలెర్ట్ అయ్యారు. భారీ భద్రత నడుమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. రామ జన్మభూమి స్థలాన్ని పూర్తిగా పేల్చి వేస్తామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పడం సంచలనమవుతోంది. ఓ స్థానికుడికి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి రామ జన్మభూమి స్థలాన్ని పేల్చేస్తామని హెచ్చరించాడు. ఉదయం ఈ పని పూర్తి చేస్తామని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసినట్టు స్థానికుడు పోలీసులకు వివరించాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్‌లనూ అప్రమత్తం చేశారు. రామ జన్మభూమి కాంప్లెక్స్ వద్ద పహారా ఇంకాస్త పెంచారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ చేసిన ఆగంతుకుడు ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.
వేగంగా పనులు..
అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఆలయం అందుబాటులోకి వస్తుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పిస్తోంది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. రామ మందిర ప్రాంగణానికి చేరుకోగానే పూజారులు, స్థానికులు ఆ శిలలకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించారు. పూజలు చేశారు. ఆ తరవాత ఆ శిలలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు. రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేయనున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నేపాల్‌లోని కలి గండకి నదీ తీరంలో ఈ శిలలను సేకరించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామ శిలల్లో ఒక దాని బరువు 18 టన్నులు కాగా...మరోటి 16 టన్నులు. విగ్రహ తయారీకి ఈ రెండు శిలలు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధరించారు.
వచ్చే ఏడాది..
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధమైపోతుందని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ తరవాత ట్రస్ట్ సెక్రటరీ ఛంపత్ రాయ్ కూడా కీలక విషయం వెల్లడించారు. గర్భగుడి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, రామ్‌లల్లా విగ్రహాన్ని వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠిస్తామని చెప్పారు. అయితే..ఆ రాముడి విగ్రహం ఎలా ఉంటుందని అంతా
ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై స్పష్టతనిచ్చారు చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్. విగ్రహం ఎలా ఉంటుందో వివరించారు. 35 అడుగుల దూరం నుంచి చూసినా...రాముడు స్పష్టంగా కనిపిస్తాడని ట్రస్ట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ శిల్పులు రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నారు.