మంచి పనులు చేసిన వారికి ఎప్పుడూ గౌరవం ఉండదు - నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
Nitin Gadkari: మంచి పనులు చేసిన వారికి సరైన గౌరవం లభించదని నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nitin Gadkari Comments: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశవాద రాజకీయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాలని చాలా మంది నేతలు కోరుకుంటున్నారని, అది ప్రజాస్వామ్య దేశానికి అంత మంచిది కాదని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరో కొందరు మాత్రమే తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటున్నారని, ఆ సంఖ్య కూడా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచి చేసే వాళ్లకు ఎప్పుడూ తగిన గౌరవం లభించదు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అలజడి సృష్టిస్తున్నాయి.
"అధికారం ఏ పార్టీది అయినా సరే. మంచి పనులు చేసిన వాళ్లకు ఎప్పుడూ తగిన గౌరవం ఉండదు. తప్పుడు పనులు చేసిన వాళ్లకు శిక్ష పడదు. ఇది నా సన్నిహితులతో ఈ విషయాన్ని చాలా సరదాగా చెబుతుంటాను"
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
పార్లమెంట్ సభ్యులకు అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం మరింత చర్చకు దారి తీసింది. ఇదే క్రమంలోనే సభలో సరైన విధంగా చర్చలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సిద్ధాంతాలకు తామే కట్టుబడకుండా చాలా మంది రాజకీయ నేతలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్నారని అన్నారు.
"సభలో చర్చ జరిగినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. అది మా సమస్య కాదు. కానీ...ఓ పద్ధతి ప్రకారం చర్చ జరగనీయకుండా చేయడమే ఇబ్బందిగా మారుతోంది. ఓ ఆలోచనా విధానం లేకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఎవరో కొంత మంది మాత్రమే తమ విలువలకు కట్టుబడి ఉంటున్నారు. ఇప్పుడు వారి సంఖ్య కూడా తగ్గుతోంది. ఇది ప్రజాస్వామ్య దేశానికి అంత మంచిది కాదు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది అని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారు"
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
రాజకీయ నేతలు వస్తుంటారు పోతుంటారని కానీ వాళ్లు చేసిన మంచి పనుల్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు నితిన్ గడ్కరీ. అదే వాళ్లకు గౌరవం తీసుకొస్తుందని వెల్లడించారు. ఈ సమయంలోనే RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఆయన ఎప్పుడూ పద్ధతిగా మాట్లాడేవారని అన్నారు.
రిటైర్మెంట్‌పై పుకార్లు..
కొన్ని మీడియా సంస్థలూ గడ్కరీ రిటైర్ అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం చేశాయి. గతంలో కొన్ని సార్లు కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తరవాత...వాటిపై గతేడాది ఓ కార్యక్రమంలో వివరణ ఇచ్చారు గడ్కరీ. అప్పటి నుంచి అధిష్ఠానంతో గడ్కరీకి భేదాభిప్రాయాలున్నాయన్న వదంతులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనిపై స్వయంగా గడ్కరీయే క్లారిటీ ఇచ్చారు. కాస్త బాధ్యతగా నడుచుకోవాలంటూ మీడియాకు చురకలు కూడా అంటించారు. రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ముంబయి గోవా నేషనల్ హైవే నిర్మాణ పనులను సమీక్షించిన గడ్కరీ..ఆ తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: చికాగోలో భారతీయ విద్యార్థిపై దాడి, సాయం కోసం పరుగులు పెట్టిన బాధితుడు - వీడియో వైరల్