Afghanistan News: 'మా జీవితం ప్రమాదంలో ఉంది.. సాయం చేయండి ప్లీజ్'
తాలిబన్ల రాజ్యంలో మహిళలకు ఎలాంటి హక్కులు ఉండవని మరోసారి రుజువైంది. ఓ న్యూస్ యాంకర్ ను విధులకు హాజరవకుండా, ఇంటికి వెళ్లిపోవాలని తాలిబన్లు ఆదేశించడం తీవ్ర చర్చకు దారితీసింది.
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలకు హక్కులు కల్పిస్తామని పైకి చెప్తున్నా చేసే పనులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఓ మహిళా పాత్రికేయురాలు పోస్ట్ చేసిన వీడియో ఇందుకు నిదర్శనం. టీవీ స్టేషన్‌లో తనను ఉద్యోగానికి అనుమతించకపోవడంపై వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Shabnam Dawran, a presenter at RTA, saying she went to the office today to keep on her job, but the Taliban told her the Govt had changed & "you aren't permitted, go home"#Kabul #Afghanistan pic.twitter.com/QZjgQjrXRf
— Hizbullah Khan (@HizbkKhan) August 18, 2021
ఆరు సంవత్సరాలుగా షబ్నమ్ వార్తా ఛానల్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఇంటికి పరిమితం కావాల్సిన వచ్చింది.
అరాచకం..
1996-2001 మధ్య కాలంలో నడిచిన తాలిబన్ల పాలనలో మహిళల హక్కులు కాలరాశారు. విద్య, ఉద్యోగం విషయంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉండేవి. అయితే ఈ సారి మాత్రం ఇస్లామిక్ చట్టాలకు లోబడి మహిళలు చదువుకునేందుకు, పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తామని వారు ప్రకటించారు. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రతీకారం..
తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ(డీబ్ల్యూ)కు చెందిన పాత్రికేయుల కోసం వారు ఏ ఇంటిని వదలకుండా గాలిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో ఓ పాత్రికేయుడి బంధువును తాలిబన్లు కాల్చిచంపినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌లో మీడియా సిబ్బంది ప్రమాదం అంచులో ఉన్నారనడానికి ఈ ఘటనే సాక్ష్యమని ఆందోళన వ్యక్తం చేసింది.