Telangana News: ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వం కీలక ప్రకటన - ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Six Guarantees: తెలంగాణలో 6 గ్యారెంటీలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Minister Ponguleti Comments on Six Guarantees: తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. సచివాలయంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ సదస్సు వివరాలను వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ గ్రామ సభల ద్వారా ఆ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 'అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు ఓ రశీదు ఇస్తారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులే స్వయంగా అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. స్వీకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం వారు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారు.' అని వివరించారు.
పథకాల్లో కోత విధించం
గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాల్లో ఎవరికీ కోత విధించమని.. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకున్నారని, ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతను కేబినెట్ లో తీసుకొచ్చినట్లు చెప్పారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి చూపించినట్లు పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ల సమావేశం అంటే కేవలం సీఎం చెప్పింది విని వెళ్లిపోయేవారని, కానీ ఈ సమావేశం అలా కాదని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. గ్రామ సభలకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారని, 'ప్రజాపాలన' కోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందుతుందన్నారు. 'ధరణి' పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని, దీని ప్రక్షాళనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎవరిపైనా కక్ష పూరిత చర్యలుండవని, తప్పు చేస్తే మాత్రం వదిలి పెట్టమని తేల్చిచెప్పారు. గతంలో 33 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారని, ప్రస్తుతం అమలవుతోన్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వల్ల 58 శాతానికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ యువతకు ఎంత ప్రమాదకరమో, రైతులు నష్టపోవడానికి నకిలీ విత్తనాలు అంతే ప్రమాదకరమని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేలా పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై పొంగులేటి కౌంటర్
బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల సందర్భంగా ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశామని వారే ఒప్పుకున్నారని, మంచిగా ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. అప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.