CM Revanth Reddy: 'జోడెద్దుల్లా పని చేయాలి, అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు' - ఆ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
Telangana News: 6 గ్యారెంటీల అమలు కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్య నెరవేరుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమీక్ష సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
CM Revanth Reddy Key Orders To Officers Review meeting: రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పని చేయాలని, సమన్వయం లేకుంటే టార్గెట్ రీచ్ కాలేమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని నిర్దేశించారు. 'సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లదే. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. అధికారులు ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి. అట్టడుగు వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చాం. అక్రమార్కులను ఉపేక్షించొద్దు. భూ కబ్జాదారులు, అవినీతిపరులను వదిలి పెట్టొద్దు.' అని సీఎం స్పష్టం చేశారు.
వారికి వార్నింగ్
రాష్ట్రంలో పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చామని, భూకబ్జాలు, అక్రమాలు, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. భూకబ్జాదారుల, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ అనే మాటే వినపడొద్దని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇష్టం లేని వాళ్లు ఎవరైనా సరే ఇప్పుడే సీఎస్, డీజీపీలకు సమాచారం ఇచ్చి బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని చెప్పారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, విధి నిర్వహణలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 'సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించలేం. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి జరిగినట్లు భావించాలి. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలి. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలి. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి మనసులు గెలుచుకోవాలి. ప్రజలతో గౌరవం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలి.' అంటూ సీఎం అధికారులకు నిర్దేశించారు. రాష్ట్ర ప్రజలు దేన్నైనా సహిస్తారని, స్వేచ్ఛను హరిస్తే మాత్రం ఊరుకోరని, ఎంతటివారినైనా ఇంటికి పంపే చైతన్యం ప్రజల్లో ఉందని అన్నారు.
ఈ నెల 28 నుంచి 'ప్రజాపాలన'
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ 'ప్రజాపాలన' (Prajapalana) కార్యక్రమం నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 'ప్రజా వాణి' నిర్వహిస్తున్నారు. ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తొలి రోజు నుంచే విశేష స్పందన లభిస్తుండగా, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ ప్రజా భవన్ కు వస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 'ప్రజా పాలన'కు శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోనుంది. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా కసరత్తు చేస్తుంది. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా 'ప్రజాపాలన' సాగనుంది. అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారు. తొలుత పది రోజుల గ్రామస్థాయిలో నిర్వహించిన అనంతరం, అవసరమైతే మరోసారి నిర్వహణపై ఆలోచన చేసే అవకాశం ఉంది.