Ayyanna Patrudu Comments: రోజా కామెంట్స్‌పై అయ్యన్న తగ్గలేదుగా! ఆ మాటలేంటి, ఆ రచ్చేంటి? పక్కనే లేడీస్, అయినా అవే వ్యాఖ్యలు!
చోడవరం మినీ మహానాడులో అయ్యన్న చేసిన కామెంట్స్, వాడిన భాష నిజంగా తీవ్ర స్థాయిలో అభ్యంతర కరంగా ఉన్నాయని ఆ సభకు హాజరైన సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు హద్దు దాటారు. అవును.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎవరిని అడిగినా ఈ మాటే చెబుతున్నారు. మంత్రి రోజాపై ఆయన చోడవరం మినీ మహానాడు లో చేసిన కామెంట్స్, వాడిన భాష నిజంగా తీవ్ర స్థాయిలో అభ్యంతర కరంగా ఉన్నాయని ఆ సభకు హాజరైన సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీలో మగాళ్లు లేరా అంటూ ఇటీవల మంత్రి రోజా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ.. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వివాదాస్పదం కాగా.. సామాన్య జనం కూడా అసహ్యించుకునే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. అంతటితో ఆగకుండా రోజా.. ఆమె భర్త పైన మరో వివాదాస్పద కామెంట్ చేసారు. ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ పైనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే లు గిడ్డి ఈశ్వరి, అనిత లాంటి మహిళలు ఉండడం గమనార్హం. అయితే ఆ సమయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా స్టేజ్ వద్దకు చేరుకోలేదు. ఒకవేళ ఆయన ఉండుంటే ఎలా స్పందించేవారు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది .
పోలీసులనూ వదలని అయ్యన్న
ఇక మహానాడుకు వస్తున్న కళాకారుల వాహనానికి పోలీసులు 5 వేల రూపాయల ఫైన్ వేశారని.. వారిని కూడా వదలరా అంటూ రాయలేని భాషలో స్టేజ్ పైనుండి విమర్శలు గుప్పించారు అయ్యన్న పాత్రుడు. మహానాడు సభకు జనం రాకుండా పోలీసులు ట్రాఫిక్ జామ్ సృష్టించారన్న ఆయన గంజాయిలోడు లారీలను మాత్రం వదిలేస్తారంటూ మరో వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. దానితో అక్కడున్న పోలీస్ అధికారులు కాస్త చిన్నబుచ్చుకున్నారు అన్న కామెంట్స్ వినిపించాయి.
రోజురోజుకీ దిగజారుతున్న పొలిటీషియన్స్ ప్రవర్తన
ఏపీలో రాజకీయ నాయకుల భాష, ప్రవర్తన రోజురోజుకీ దిగజారుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నా వారు మాత్రం సంకోచించడం లేదు. సోషల్ మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు బూతులు గుప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా పబ్లిక్ మీటింగ్ వేదికల నుండే బూతులు మాట్లేడేస్తున్న రాజకీయ నాయకుల ప్రవర్తన ఏపీలో పాలిటిక్స్ ఎంత అథమ స్థాయికి దిగిపోయాయో అంటున్నారు ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.