Srikakulam News: శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారి ప్రయాణం నరకయాతనే, రోడ్డుకు మోక్షమెన్నడో!
Srikakulam Roads | శ్రీకాకుళం కొత్తరోడ్డు సమీపంలో ప్రధాన రహదారి గోతిలో దిగిన లారీలు గంటల తరబడి శ్రీకాకుళం -ఆమదాలవలస మధ్య ట్రాఫిక్ జామ్ హైవేపై భారీగా నిలిచిన వాహనాలు
Srikakulam and Amadalavalasa road journey | శ్రీకాకుళం –ఆమదాలవలస రహదారిపై ప్రయాణమంటే నరకమే. నాలుగు రోడ్ల విస్తరణ పనులు ఏ ముహుర్తాన ప్రారంభించారో గాని ఏళ్ల తరబడుతున్న పూర్తి స్థాయిలో పది కిలోమీటర్లు రోడ్డును పూర్తి చేయలేకపోతున్నారు. మరోసారి రహదారిలో ప్రయాణీకులు, వాహన చోదకులు పడే యాతన అంతా ఇంతా కాదు. అడుగు అడుగున పెద్ద పెద్ద గుంతలు. కొద్ది దూరమే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉన్న ఆ పనులు పూర్తి చేయడం లేదు. దీంతో ఒకే ప్రాంతంలో ఎదురెదురుగా రెండు లారీలు గోతుల్లో దిగబడ్డాయి. ఇంకేముంది.. అటు ఆమదాలవలస ఇటు శ్రీకాకుళం అటు జాతీయ రహదారిపై కిలోమీటర్లు మేర గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది.
ప్రధాన రహదారి అయిన గతంలో వైసీపీ ప్రభుత్వం ఇపుడు కూటమి సర్కార్ ఈ రోడ్డును పూర్తి చేయడంలో విఫలమయ్యారంటు జనం మండిపడు తున్నారు. కేవలం నాలుగైదు కిలో మీటర్లు నాలుగు రోడ్ల విస్తరణ పనులు ఏళ్ల తరబడి రోడ్డు పూర్తి చేయలేకపోవడం పాలకుల చిత్తశుద్ది నిదర్శనమంటు ఎద్దేవా చేస్తున్నారు. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే జనం ప్రభుత్వానికి, అధికారులకు, ఎమ్మెల్యేలకు చివాట్లు దీవెనలు పెట్టని రోజంటు లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే పరిస్థితి ఉండేది. ఈ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొనడం ఆపై పనుల్లో కదలికవచ్చింది. రాగోలు వద్ద పనులు ప్రారంభించగా ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. దీంతో తొందరలో పనులు పూర్తి చేస్తారని భావించిన ఈ పనులకు గ్రహణం చుట్టుకుంది. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి ఎన్నికల హమీగా కూటమి నేతలు భరోసా ఇచ్చినా ఈ రోడ్డు పనులు పూర్తి చేయడం లేదు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆముదాలవలస రహదారిని పూర్తి చేస్తామని ఇచ్చిన హమీ మేరకు ప్రజలు ఎదురు చూసి వంద రోజులు గడిచిపోయాయి. 10. 4 కిలో మీటర్లు మేర నాలుగు రోడ్లవిస్తరణ పనులకు గాను ఇంకా కేవలం నాలుగు కిలోమీటర్లుమేరకు రోడ్డు ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందులోకొత్త రోడ్డు నుంచి రాగోలు వరకు సుమారు 1.5 కిలోమీటరు రోడ్డు పనులు పూర్తి చేస్తే ఇక శ్రీకాకుళం నగరంవైపు విస్తరణ పనుల కోసం జనం కూడ పట్టించుకోరు. అటుచింతాడ వద్ద రోడ్డు వద్ద కొద్ది మీటర్లు పనులు పూర్తి చేస్తేదాదాపు ప్రజల కష్టాలు తీరుతాయని వేరేగ చెప్పనక్కరలేదు. ఈ మాత్రం పనుల పూర్తి చేయడంలో తాత్సా రంతో ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోంటుంది.ఇదివరకుచెరువులను తలపించే గోతులను ఆర్ అండ్ బీ అధికారులుపూడ్చేందుకు చొరవ సుకుంటే ఆ పరిస్థితిఎదురయ్యేది కాదు. గత కొన్నిరోజులుగా రాగోలు నుంచి కొత్తరోడ్డు మధ్య ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆర్ అండ్ బీ అధికారులు సైతం కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన 15 కోట్ల రూపాయలు బిల్లులు ముట్టజెప్పక పోవడంతో వారు సైతం కాంట్రాక్టర్ పై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నామని చేతులేత్తేస్తున్నారు. ఇటివల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా మారడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోడ్డును పూర్తి చేయడమే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తాను కాంట్రాక్టుతో మాట్లాడి వీలున్నంత వరకు సహకరించి పనులు చేపడతామని ఇది వరకే భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుతో గత నెలలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కలిసి ఆముదాలవలస - శ్రీకాకుళం రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చొరవ తీసుకుని నిధులు సమకూర్చాలని కోరారు. జిల్లాలోని వాకలవలస వద్ద గతంలో రోడ్డుపై బైఠాయించి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారి అధ్వానంగా తయారుకావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 70 మందికి పైగా ప్రాణాలు పోయాయని అప్పట్లో ఆందోళన చేసిన విషయం విదితమే . శ్రీకాకుళం- ఆముదాలవలస రోడ్డు పేరు వింటేనే జిల్లా వాసులే కాదు ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తదితర ప్రాంత ప్రజలు, వాహనదారులు హడలెత్తిపోతున్నారు. రోడ్ల విస్తీర్ణం పేరుతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా మారిందని మండిపడుతున్నారు.
శ్రీకాకుళం నగరం నుండి ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపం వరకు ఉన్న దాదాపు 10 కిలోమీటర్ల ప్రధాన రహదారిని నాలుగు వరుసలుగా విస్తీర్ణం చేసేందుకు 2021 డిసెంబర్ నెలలో రూ. 40 కోట్ల రూపాయల అంచనాలతో 24 నెలల్లో పూర్తి చేసేందుకుప్రభుత్వం పనులు ప్రారంభించింది. గత ప్రభుత్వ వైఫల్యం అంతా ఇంతాకాదు. వైసీపీ సర్కార్లో ఒకవైపు ఏపీ శాసన సభ స్పీకర్, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి నియోజకవర్గాలను కలుపుతూ ఉన్న ప్రధాన రహదారిని పూర్తి చేయించలేకపోతున్నారు. ఆటోలో వెళ్లిన, బస్సు, కార్లలో ప్రయాణించిన గుంతల కారణంగా శరీరమంతా నొప్పులు వచ్చి అనారోగ్యాల బారిన పడుతున్నామంటూ ప్రజలు మొత్తుకుంటున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు.. ఆర్టీసీకి భారీ నష్టం
శ్రీకాకుళం కొత్తరోడ్డుకు సమీపంలో ప్రధాన రహదారి గోతులలో దిగబడిన లారీలతో భారీగా ట్రాఫిక్ స్తంభిం చింది. శ్రీకాకుళం నుంచి ఆముదాలవలస మధ్య వాహనాలు తిరగాల్సిన బస్సులు ఇతర భారీ వాహనాలు సింగుపూర్ మీదుగా రాకపోకలు సాగించారు. ఆటోలు, టూవీలర్ లు ఆర్టీవో కార్యాలయం మీదుగా నడిచాయి. ఈ ట్రాఫిక్ ప్రభావంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మూడు స్టేషన్ల పోలీసులు, ఇతర శాఖాధికారులు నానా పాట్లు పడ్డారు. శుక్రవారం ఉదయం ఆరుగంటలనుంచి ఈ సమస్య ప్రారంభమవ్వడంతో విద్యా ర్థులు, ఉద్యోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాలకొండ, కొత్తూరు, పార్వతీపురం, బత్తిలి, గుణుపూర్ తిరగాల్సిన వాహనాలు ఆముదాల వలసకు వెళ్లేందుకు 15కిలోమీటర్లు అదనపు దూరం తిరిగి నడిచాయి. రెండు వైపుల లెక్కలేసుకుంటే 30 కిలోమీటర్లు ఆయిల్ భారం వేయాల్సి వచ్చింది.
శ్రీకాకుళం పాలకొండ రాకపోకలకు 80 కిలో మీటర్లు కాగా 110 కిలో మీటర్లు తిరగాల్సి వచ్చింది. 30 కిలోమీటర్లకు ఆరు లీటర్ల ఆయిల్ భారం పడిందని లెక్కలేసుకుంటున్నారు. లీటరు వంద రూపాయలు చొప్పున ఆరువందలు భారం ఓ వైపు అయితే - మరో వైపు తిరగాల్సిన ట్రిప్పులు తగ్గిపోయాయంటున్నారు. దాదపుగా 24 బస్సులపై ఈ భారం పడిందని, దీనివల్ల అధనం నష్టాన్ని చూడాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మొత్తంపైన కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు రోడ్డు పూర్తి చేసి కూటమి ప్రభుత్వంపై ఉన్న మచ్చను తొలగించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Vijayawada News: బుడమేరు కట్ట మళ్లీ తెగిందని ప్రచారం - విజయవాడ వాసులకు మంత్రి నారాయణ కీలక సూచనలు