Russia Shooting: రష్యా సైనికులపై కాల్పులు- 11 మంది మృతి, 15 మందికి గాయాలు!
Russia Shooting: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Russia Shooting: ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గొరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యా సైనిక శిక్షణ శిబిరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.
ఇదీ జరిగింది
ఉక్రెయిన్‌పై వరుస దాడులు చేస్తోన్న రష్యాకు ఈ ఘటన భారీ షాక్ ఇచ్చింది. సైనిక శిక్షణ కేంద్రంపై ఉగ్ర దాడి జరిగినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మాజీ సోవియెట్ స్టేట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఈ కాల్పులు చేసినట్లు తెలిపింది. ఇద్దరు దుండగులను బలగాలు మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్‌కు సాయం చేస్తోన్న నాటో కూటమి దేశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ7 దేశాలు ఇటీవల రష్యాకు వార్నింగ్ ఇవ్వడంపై పుతిన్ సీరియస్ అయ్యారు.
కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాల సమావేశంలో శుక్రవారం పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతానికి భారీ దాడుల ప్రణాళికేమీ లేదని, ఆ దేశ వినాశనాన్ని తాము కోరుకోవడం లేదని పుతిన్ అన్నారు. కెర్చ్ వంతెన పేల్చివేతను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అలాంటి ఉగ్ర దాడులకు దిగితే మాత్రం ఆహార ధాన్యాల ఎగుమతికి వీలు కల్పించిన 'మానవతా కారిడార్లను' మూసివేస్తామన్నారు.
జీ7 దేశాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించడంపై జీ7 దేశాలు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోందని మండిపడ్డాయి. పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై కూడా జీ7 దేశాలు తీవ్రంగా స్పందించాయి.
Also Read: Biden On Pakistan: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్ - జో బైడెన్