Biden On Pakistan: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్ - జో బైడెన్
Biden On Pakistan: పాకిస్థాన్‌పై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Biden On Pakistan:
పాక్ ప్రమాదకరం..
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశమేదైనా ఉందంటే...అది పాకిస్థాన్ మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ ఆక్రమణపైనా ఈ సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు బైడెన్. ప్రపంచ దేశాలపైనే కాకుండా అమెరికాకు మిగతా దేశాలకున్న సత్సంబంధాలను ఈ యుద్ధం చెడగోడుతోందని అన్నారు. అటు చైనాతో సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. "చైనాతో మళ్లీ చేయి కలిపి పాత బంధాన్ని పునరు ద్ధరించే బాధ్యతను బరాక్ ఒబామా నాకు అందించారు" అని కామెంట్ చేశారు. "జిన్‌పింగ్‌తో నేను వ్యక్తిగతంగా చాలా సమయం గడిపాను. దాదాపు 78 గంటల పాటు కలిసున్నాం. అది చాలా విలువైన సమయమనే అనుకుంటున్నాను" అని చెప్పారు. జిన్‌పింగ్‌కి అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని, కానీ...తనకుంటే సమస్యలు తనకున్నాయని అన్నారు బైడెన్. రష్యా అణుహెచ్చరికల గురించీ పరోక్షంగా ప్రస్తావించారు.
"What I think is maybe one of the most dangerous nations in the world, Pakistan. Nuclear weapons without any cohesion", said US President Joe Biden at Democratic Congressional Campaign Committee Reception pic.twitter.com/cshFV5GVHY
— ANI (@ANI) October 15, 2022
జోక్ కాదు..
ఇటీవలే బైడెన్ రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వాయు ధాలను ప్రయోగిస్తామని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు జోక్ కాదని బైడెన్ అన్నారు. 1962లో క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత అమెరికా ఈ స్థాయిలో తీవ్రమైన అణు ముప్పును చూడలేదని బైడెన్ తెలిపారు.
" పుతిన్ జోక్ చేయడం లేదు. టాక్టికల్ అణ్వాయుధాలు, జీవాయుధాలు లేదా రసాయన ఆయుధాల వినియోగం గురించి పుతిన్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన సైనిక శక్తి ఆశించిన స్థాయిలో పోరాడటం లేదు. ఇది కేవలం అణ్వాయుధ వినియోగంతోనే ముగియదు. "
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
పుతిన్ హెచ్చరికలు..
మాన్‌హట్టన్‌లో జరిగిన డెమొక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం పుతిన్ చేస్తున్న అణు బెదిరింపులు ఏమాత్రం హాస్యాస్పదం కాదని బైడెన్ ఈ సందర్భంగా అన్నారు. పుతిన్‌ను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని బైడెన్ తెలిపారు. ఒకవేళ నాటో దళాలు కనుక రష్యా సైన్యంతో తలపడేందుకు సిద్ధమైతే "మహా విపత్తు" వస్తుందని పుతిన్ హెచ్చరించారు. కజికిస్థాన్ రాజధాని అస్టానాలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్. "నాటో దళాలు రష్యా ఆర్మీతో నేరుగా యుద్ధం చేసేందుకు వస్తే మా తరవాతి వ్యూహం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బహుశా అది మహా విపత్తుకి దారి తీయొచ్చు. దీని గురించి కాస్త తెలివిగా ఆలోచించి అలాంటి పని చేయకుండా ఉంటారని ఆశిస్తున్నా" అని స్పష్టం చేశారు. గతంలో ఎన్నో సార్లు పుతిన్ "అణు" హెచ్చరికలు చేశారు. వీటిని అంత తేలిగ్గా తీసుకోకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పుతిన్ మరోసారి అలాంటి హెచ్చరికలే చేయటం కలవర పెడుతోంది.
Also Read: Import Export Growth: ఎగుమతులు పెరిగినా, 'వాణిజ్య లోటు'దీ అదే దారి