Import Export Growth: ఎగుమతులు పెరిగినా, 'వాణిజ్య లోటు'దీ అదే దారి
021 సెప్టెంబరులో వాణిజ్య లోటు 22.47 బిలియన్ డాలర్లు. ఈ ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే (YoY) ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు ఎక్కువగానే ఉంది.
Import Export Growth: అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తగ్గడం, కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడం, వరుసగా మూడో నెలలో ఆర్డర్ ఫ్లో దెబ్బతినడం వంటి కారణాలతో మన దేశం నుంచి ఎగుమతులు (Merchandise Exports) సెప్టెంబరులో 35.5 బిలియన్ డాలర్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఇప్పుడు ఎగుమతులు కేవలం 4.8 శాతం పెరిగాయి.
అయితే.. దిగుమతుల వృద్ధిలో వేగం తగ్గడం, దేశీయ డిమాండ్‌లో బలం తగ్గడం, గత ఏడాది ఇదే కాలంలోని హై బేస్ ప్రభావం వంటి కారణాలతో వాణిజ్య లోటు (Trade Deficit) కాస్త తగ్గింది. అంతకుముందు నెలలోని (ఆగస్టు) రికార్డ్ స్థాయి స్థాయి 28 బిలియన్ డాలర్ల నుంచి (QoQ) సెప్టెంబర్‌లో 25.7 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 సెప్టెంబరులో వాణిజ్య లోటు 22.47 బిలియన్ డాలర్లు. ఈ ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే (YoY) ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు ఎక్కువగానే ఉంది.
భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ గణాంకాలను ప్రకటించింది. మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... సెప్టెంబర్‌లో దేశ దిగుమతులు 8.7 శాతం పెరిగి 61.2 బిలియన్ డాలర్లకు చేరాయి. జులైలో 43.6 శాతం, ఆగస్టులో 37.3 పెరిగాయి.
తగ్గిన కోర్ ఎక్స్‌పోర్ట్స్
సెప్టెంబర్ నెలలో దేశం నుంచి బయటకు వెళ్లిన ఇంజినీరింగ్, అన్ని రకాల రెడీమేడ్ వస్త్రాలు, ప్లాస్టిక్, జీడిపప్పు, కార్పెట్ ఎగుమతుల్లో నెగెటివ్ గ్రోత్ నమోదైంది. రత్నాలు & ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు, తోళ్లు, ఔషధాలు, రసాయనాలు, బియ్యంలో పాజిటివ్ గ్రోత్ కనిపించింది.
ప్రధాన ఎగుమతులు (పెట్రోలియం, రత్నాలు & ఆభరణాలు మినహా) సెప్టెంబర్‌లో 4.6 శాతం తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు 24.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2020 మే నెల నుంచి అత్యధిక నెలవారీ తగ్గుదల.
తగ్గిన గోల్డ్, క్రూడ్ ఇంపోర్ట్స్
చమురు దిగుమతులు 5.38 శాతం తగ్గి 15.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. బంగారం దిగుమతులు 24.62 శాతం తగ్గి 3.9 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. బొగ్గు, కోల్ కోక్, బ్రికెట్స్ 60.82 శాతం పెరిగి 3.5 బిలియన్ డాలర్లకు చేరాయి.
సర్వీసెస్
సేవల ఎగుమతులు 18.72 శాతం పెరిగి 25.65 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, సేవల దిగుమతులు కూడా 20 శాతం పెరిగి 15.10 బిలియన్ డాలర్లకు చేరాయి.
తొలి అర్ధభాగంలో..
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో ఎగుమతులు 16.96 శాతం పెరిగి 231.88 బిలియన్ డాలర్లకు; దిగుమతులు 38.55 శాతం వృద్ధితో 380.34 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు 148.46 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో వాణిజ్య లోటు 76.25 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే, వాణిజ్య లోటు ఏడాదిలోనే దాదాపు రెట్టింపు పెరిగింది.
జూన్ త్రైమాసికంలో 15 త్రైమాసికాల గరిష్ట స్థాయికి భారత కరెంట్ ఖాతా లోటు (Current Account Deficit) చేరింది. సెప్టెంబర్‌లో పెరిగిన వాణిజ్య లోటు దీనిని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.