Quetta Bomb Blast: పాకిస్థాన్‌లో ఆగని ఉగ్రదాడులు, ఆ ప్రావిన్స్‌లో బాంబుల మోతలు
Quetta Bomb Blast: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో ఉగ్రదాడి జరిగింది.
Quetta Bomb Blast:
బలూచిస్థాన్‌లో దాడి..
పాకిస్థాన్‌లో బాంబుల మోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఘటన మర్చిపోక ముందే మరోటి జరుగుతోంది. ఇటీవలే పెషావర్‌లో ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. దానిపై విచారణ జరుగుతున్న సమయంలోనే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా ప్రాంతంలో మరో దాడి జరిగింది. పోలీస్ పోస్ట్‌కు సమీపంలోనే ఈ దాడి జరగటం కలవరం సృష్టిస్తోంది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు పాక్ మీడియా తెలిపింది. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న సైనికులు, పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తెహరీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ప్రకటించుకుంది. ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. భద్రతా అధికారులను టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. మూసా చౌకీలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు స్థానికులు చెప్పారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా కూడా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
Reports of multiple injuries in a bomb blast in highly secure area of Quetta near the Police headquarters and entrance of Quetta Cantonment. The city is under strict security due to a PSL cricket match. pic.twitter.com/lZcfn1VQRU
— The Balochistan Post - English (@TBPEnglish) February 5, 2023
పాకిస్థాన్‌లో ఇటీవలే ఆత్మాహుతి దాడి జరిగింది. పెషావర్‌లోని ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సమీపంలో భారీగా పేలుడు శబ్దం వినిపించింది. ఈ పేలుడు ధాటికి మసీదు కూడా కొంత మేర ధ్వంసమైంది. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా...100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మసీదు శకలాల కింద కొందరు చిక్కుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేశారు. ఆంబులెన్స్‌లను తప్ప మరే వాహనాలనూ అనుమతించడం లేదు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం..మసీదు పైకప్పు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు తేలింది. చనిపోయిన 17 మందిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఆర్మీ యూనిట్ ఆఫీస్‌కు దగ్గర్లోని మసీదు వద్ద ఇలాంటి దాడి జరగటం సంచలనమవుతోంది. ఈ పేలుడు శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల వరకూ వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు. చాలా సేపటి వరకూ పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేసిందని చెప్పారు. ప్రార్థనలు చేస్తున్న వారిలోనే ముందు వరుసలో కూర్చుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. పోలీసులు నిఘా సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందన్న వాదన వినిపిస్తోంది.
Also Read: Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?