(Source: Poll of Polls)
PM Modi Russia Visit: రష్యాకి చేరుకున్న ప్రధాని మోదీ, పుతిన్‌తో కీలక చర్చలు - ఉక్రెయిన్‌పై ప్రకటన చేసే అవకాశం!
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకి చేరుకున్నారు. అక్కడ ప్రెసిడెంట్ పుతిన్‌తో కీలక చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఇద్దరి మధ్యా చర్చ జరగనుంది.
PM Modi Lands in Russia: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా (PM Modi Russia Visit) చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరవాత మోదీ తొలిసారి రష్యా పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. రష్యా డిప్యుటీ పీఎం డెనిస్ మంటురోవ్ ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి రష్యాకి వెళ్లిన ప్రధాని ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలకంగా ప్రస్తావించనున్నారు. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి సంబంధించిన అజెండాలోనూ ఈ అంశం ఉంది. రష్యా, పశ్చిమ దేశాల మధ్య వైరం పెరుగుతున్న సమయంలో భారత్, రష్యా దగ్గరవుతుండడం అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తోంది. అందుకు మరో కారణంగా రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురుతో పాటు ఆయుధాలు భారత్‌కి సరఫరా అవుతున్నాయి. కానీ అటు పశ్చిమ దేశాలకు మాత్రం ఇదంతా నచ్చడం లేదు. కాకపోతే చైనాతో భారత్ ఢీకొడుతుండడం వల్ల పశ్చిమ దేశాలు ఇండియాకి దగ్గరవుతున్నాయి. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో పట్టు సాధించాలంటే భారత్ మద్దతు అవసరమని భావిస్తున్నాయి. అదే సమయంలో భారత్ రష్యాకి కాస్త దూరంగా ఉంటేనే మంచిదంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కానీ భారత్ మాత్రం సమన్యాయం పాటిస్తూ అన్ని దేశాలతోనూ మైత్రి కొనసాగిస్తోంది. 2019లో చివరిసారి ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ తరవాత 2021లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కి వచ్చారు. కొద్ది రోజుల తరవాత ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైంది.
Landed in Moscow. Looking forward to further deepening the Special and Privileged Strategic Partnership between our nations, especially in futuristic areas of cooperation. Stronger ties between our nations will greatly benefit our people. pic.twitter.com/oUE1aC00EN
— Narendra Modi (@narendramodi) July 8, 2024
రష్యా నుంచే భారత్‌కి ఎక్కువ మొత్తంలో ఆయుధాలు దిగుమతి అవుతున్నప్పటికీ ఉక్రెయిన్ వాటా కూడా బాగానే ఉంది. ఉక్రెయిన్ ఈ విషయంలో ఆధిపత్యం చెలాయించాలని చూసింది. ఈ మధ్య కాలంలో రష్యా నుంచి ఆయుధాల దిగుమతి తగ్గిపోయింది. ఇటు భారత్ మాత్రం రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంతో పశ్చిమ దేశాలన్నీ చమురు, గ్యాస్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అంత సంక్షోభంలోనూ భారత్, రష్యాతో డీల్ కుదుర్చుకుంది. ముడి చమురుని తక్కువ ధరకే దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇదే పశ్చిమ దేశాల దృష్టిని మరింత ఆకర్షించింది. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకూ చమురు దిగుమతి పెరుగుతూనే ఉంది. రష్యా పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రియా రాజధాని వియన్నాకి వెళ్లనున్నారు. 1983లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ వియన్నాకి వెళ్లారు. ఆ తరవాత అక్కడ పర్యటించేందుకు వెళ్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే.