Pawan Kalyan Hindi: తెలుగు అమ్మ , హిందీ పెద్దమ్మ - నేర్చుకుంటే మరింత బలపడతాం - పవన్ కల్యాణ్ పిలుపు
Pawan Speech: హిందీ నేర్చుకుంటే మరింత బలపడతామని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు అమ్మ అయితే.. హిందీ పెద్దమ్మ అన్నారు.

Pawan Kalyan On Hindi: "తెలుగు మన మాతృభాష అమ్మ అయితే, హిందీ మన పెద్దమ్మ లాంటిది" అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆయన హిందీని రాష్ట్ర భాషగా సమర్థిస్తూ, దాని ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు.
పవన్ కల్యాణ్ హిందీని "రాష్ట్ర భాష"గా అభివర్ణించారు, ఇది భారతదేశంలోని వివిధ సంస్కృతులను, భాషలను ఒక కామన్ థ్రెడ్‌గా కలుపుతుందని పేర్కొన్నారు. "మన దేశంలో వివిధ సంస్కృతులు ఉంటాయి. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుంది. హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకు? హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దాం." అని పిలుపునిచ్చారు. హిందీని నేర్చుకోవడం ద్వారా భారతీయులు మరింత బలపడతారని, ఇది జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. "హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మరింత బలపడటం" అని పవన్ స్పష్టం చేశారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వలనే కదా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదన్నారు.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భారతీయ భాషలను మాతృభాషలుగా గౌరవించాలని, అయితే హిందీని "పెద్దమ్మ" లాంటి భాషగా భావించాలని సూచించారు. ఇంట్లో మాతృభాషను మాట్లాడవచ్చని, కానీ రాష్ట్ర , దేశ సరిహద్దులను దాటినప్పుడు హిందీ రాష్ట్ర భాషగా ఉపయోగపడుతుందని అన్నారు. హిందీపై రాజకీయాలు చేయడం సరికాదని, కొందరు దీనిని రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు. విదేశీయులు భారతీయ భాషలను నేర్చుకుంటున్న సమయంలో, భారతీయులు హిందీపై భయం లేదా ద్వేషం చూపడం దురదృష్టకరమని అన్నారు. "ఒకపక్క విదేశీయులు మన భాషలు నేర్చుకుంటుంటే, మనకు మన హిందీ భాషపై ఎందుకు భయం, ద్వేషం చూపిస్తున్నామని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
హిందీలో పవన్ కళ్యాణ్ స్పీచ్ #hindi #pawankalyan #kishanreddy #ABPTeluguNews #ABPDesam #telugunews#APDeputyCMPawanKalyan pic.twitter.com/TshzUzhVAx
— ABP Desam (@ABPDesam) July 11, 2025
ఉదాహరణకు సినిమాల పరంగా చూసుకుంటే సౌత్ ఇండియన్ సినిమాలలో 31 శాతం శాతం సినిమాలు హిందీలో డబ్ అయ్యి ఆదాయం వస్తుంది. ఇలా వ్యాపారాలకు హిందీ కావాలి, నేర్చుకోడానికి మాత్రం హిందీతో ఇబ్బందేంటి అని పవన్ ప్రశ్నించారు. ఖుషీ సినిమాలో ఏ మేర జహా అని ఎందుకు పెట్టాలంటే అప్పట్లోనే నాకు హిందీ భాష పైన ఉన్న గౌరవం. ఒక తెలుగు సినిమాలో హిందీ పాట పెట్టాల్సిన అవసరం ఎందుకు ఒచ్చింది అంటే మాతృ భాష తెలుగు ఐతే రాష్ట్ర భాష హిందీ ఇది చెప్పడానికే చేసాను అలా అని తెలిపారు. తమిళనాడు, కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ హిందీ వివాదం ఉంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ హిందీని రాష్ట్ర భాషగా, జాతీయ సమైక్యతకు సాధనంగా సమర్థిస్తూ, మాతృభాషలకు గౌరవం ఇవ్వాలని సూచించడం ఆసక్తికరంగా మారింది.



















