(Source: Poll of Polls)
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం లేదు.
Parliament Winter Session: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నిర్వహణ కారణంగా ఒక నెల ఆలస్యంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగనున్నాయి. ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాకపోవడంతో పాత పార్లమెంట్ భవనంలోనే ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాలకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ హాజరు కావడం లేదని పార్టీ తెలిపింది. స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో నిమగ్నమై ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరు కావడం లేదని ఆయన తెలిపారు.
వ్యూహాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలను, లేవనెత్తాల్సిన అంశాల గురించి నిర్ణయం తీసుకోవడానికి పార్టీ నేతలు సోనియా గాంధీ ఇంట్లో శనివారం సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
జోడో యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారం ఝల్వార్ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. కోట డివిజన్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుంది. ఈ యాత్ర మొత్తం 218 కిలోమీటర్లు ఉంటుంది.
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతోన్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. దీంతో కాంగ్రెస్ అధి నాయకత్వం, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి దిగుతున్నారు.
మహిళా మార్చ్
2023లో రెండు నెలల పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో 'మహిళా మార్చ్' ప్రారంభమవుతుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆదివారం ప్రకటించారు. 2023 జనవరి 26, నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక పాదయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో 85వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Congress Steering Committee: బాధ్యతగా ఉండాలి- లేకుంటే పార్టీని వీడాలి: ఖర్గే వార్నింగ్