Bengal Assembly Election Polling: బెంగాల్ తొలి విడతలో 90 శాతానికిపైగా పోలింగ్ - పలు చోట్ల ఘర్షణలు !
Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో 90 శాతానికిపైగా పోలింగ్ నమోదు అయింది. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Bengal First Phase Polling: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం అసాధారణ పోలింగ్ పర్సంటేజీతో ముగిసింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్ ముగిసే సమయానికే దాదాపు 90 శాతం ఓటింగ్ నమోదు అయింది. చివరి నిమిషంలో క్యూలైన్లలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తే ఈ సంఖ్య 92 శాతానికి పైగా చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రణరంగాన్ని తలపించిన కుమార్‌గంజ్
ఎన్నికల రోజున దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని కుమార్‌గంజ్ నియోజకవర్గం యుద్ధభూమిని తలపించింది. బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. బూత్ తనిఖీకి వెళ్లిన ఆయనను వందలాది మంది వెంబడించడంతో, ప్రాణభయంతో ఆయన పొలాల గుండా పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆయనను పట్టుకుని కొట్టడమే కాకుండా, ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. కేవలం కుమార్‌గంజ్ మాత్రమే కాకుండా ముర్షిదాబాద్‌లోని నౌడాలో టీఎంసీ, ఏజేయూపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బాంబు దాడులు జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. డొమ్కల్ ప్రాంతంలో ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. బిర్భూమ్‌లోని లాభ్‌పూర్ వద్ద బీజేపీ ఏజెంట్‌పై దాడి జరిగి తల పగిలినట్లు సమాచారం అందింది.
జిల్లాల వారీగా పోలింగ్ సరళి
ముర్షిదాబాద్ జిల్లా 91.36 శాతం ఓటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. కూచ్ బెహార్ (90%), బంకురా (90%), ఝార్గ్రామ్ (90.53%) వంటి జిల్లాల్లో కూడా ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించింది. 2021 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగిన తర్వాత కూడా ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు అవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
West Bengal recorded an impressive 89.93% voter turnout till 5 PM in the first phase of the 2026 Assembly elections. Polling is underway across 152 constituencies, reflecting strong public participation in the democratic process.#TheSEntinel #WestBengal #VoterTurnout pic.twitter.com/VgFj0mZZ3K
— The Sentinel (@Sentinel_Assam) April 23, 2026
బ్యాలెట్ బాక్సుల్లో ప్రధాన నేతల భవితవ్యం
ఈ తొలి విడతలో రాష్ట్ర రాజకీయాలను శాసించే కీలక నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ముఖ్యంగా నందిగ్రామ్‌లో సువేందు అధికారి, ఖరగ్‌పూర్ సదర్‌లో దిలీప్ ఘోష్, ముర్షిదాబాద్‌లో హుమాయున్ కబీర్ వంటి ఉద్ధండుల గెలుపోటములు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తన కోటను కాపాడుకోవాలని చూస్తుండగా, బీజేపీ ఈసారి పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
రెండో విడతకు సన్నద్ధం
రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను, మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. కోల్‌కతా , పరిసర పట్టణ ప్రాంతాల్లో ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో జరిగిన హింస దృష్ట్యా, రెండో విడతలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















