జులై 1 వ తేదీ నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, కేంద్రం కీలక ప్రకటన
New Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
New Criminal Laws: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను పక్కన పెట్టి ఈ కొత్త చట్టాలను రూపొందించింది. Indian Penal Code of 1860, CrPC, Indian Evidence Act చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సన్హిత (Bharatiya Nyaya Sanhita), భారతీయ నాగరిక్ సురక్షా సన్హిత (Bharatiya Nagarik Suraksha Sanhita), భారతీయ సాక్ష్య సన్హిత బిల్స్‌ని (Bharatiya Sakshya Sanhita) తీసుకొచ్చింది. గతేడాది డిసెంబర్‌లోనే ఈ మూడు బిల్లులకీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. భారతీయతత్వానికి తగ్గట్టుగా దేశ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త చట్టాలను రూపొందించినట్టు కేంద్రహోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. పార్లమెంట్‌లో ఈ బిల్స్‌ని ప్రవేశపెట్టిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త టెక్నాలజీని వినియోగించుకోవడం సహా ఫోరెన్సిక్ సైన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా ఈ చట్టాలు తయారు చేశామని తెలిపారు. మరో ఐదేళ్లలో ఇండియన్ క్రిమినల్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అత్యాధునికమైందిగా రికార్డు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. న్యాయ సన్హితలో 20 నేరాల జాబితాని చేర్చింది కేంద్ర హోంశాఖ. ఉగ్ర దాడులు, మూక దాడులు, హిట్ అండ్ రన్, లైంగిక వేధింపులు, దొంగతనాలు, ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేయడం లాంటి నేరాలకు న్యాయ సన్హితలో శిక్షలు ఉన్నాయి.
Bharatiya Sakshya Adhiniyam 2023, Bharatiya Nagarik Suraksha Sanhita 2023 and Bharatiya Nyaya Sanhita 2023 to come into effect from 1st July, 2024. pic.twitter.com/Kw0F3I7A4D
— ANI (@ANI) February 24, 2024
అమిత్ షా ఏం చెప్పారంటే..?
ఈ మూడు బిల్స్‌నీ రాజ్యాంగ స్ఫూర్తితోనే రూపొందించినట్టు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో వెల్లడించారు అమిత్ షా. బ్రిటీష్ కాలం నాటి చట్టాలు ప్రజలకు న్యాయం చేయలేవని, అందుకే సవరణలు చేయాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యం జరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఈ కొత్త బిల్స్‌లో ప్రొవిజన్స్ చేర్చినట్టు వివరించారు అమిత్ షా. కోర్టులలో కేసులు వాయిదాలు పడడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఈ సమస్య ఉండదని అన్నారు. ఎలా అయినా సరే న్యాయం జరగడంలో ఆలస్యం అయితే అది ప్రభుత్వానిదే తప్పిదమవుతుందని అందుకే కొత్త బిల్స్‌లో ఈ సమస్య తీర్చామని వివరించారు.
"ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయన సూచన మేరకు నేను ఈ కొత్త బిల్స్‌ని ప్రవేశపెట్టాను. ఇవి ప్రజలకు మేలు చేయడమే కాదు రాజ్యాంగ స్ఫూర్తినీ చాటుతాయి. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా అన్ని చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నాం. బ్రిటీష్ కాలం నాటి చట్టాల్ని ఇప్పుడు ప్రజలకు ప్రయోజనం కలిగేలా సవరణలు చేశాం. గతంలో ప్రవేశపెట్టి ఉపసంహరించుకున్న ఈ బిల్స్‌లో చిన్న చిన్న మార్పులు చేశాం. స్టాండింగ్ కమిటీ వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించింది"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి