Nara Lokesh: సీఎం జగన్ ఉచితాలు తీసేశారు, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ: నారా లోకేశ్
Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.
Nara Lokesh: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 19వ రోజు పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లో లోకేశ్ పర్యటించారు. నారాయణవనం మండలం రాళ్ల కాల్వ, గోవిందప్ప నాయుడు కండ్రిగ, కైలాసకోన రహదారి, అరణ్యం కండ్రిగ, కృష్ణంరాజు కండ్రిగ, ఐఆర్ కండ్రిగల మీదుగా లోకేశ్ పాదయాత్ర సాగింది.
లోకేశ్‌ను కలిసి మొర పెట్టుకున్న ఎస్సీ మహిళలు
యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ ని కలిసిన పలువురు ఎస్సీ మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ కాలనీల్లోని దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన హామీని నెరవేర్చుకోలేక పోయారని తెలిపారు. వైసీపీ సర్కారు విద్యుత్ రాయితీని తొలగించిందని లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న నారా లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ కాలనీల్లోని దళితులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెదురు కళాకారులతో లోకేశ్ మాట్లాడారు. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి వర్గీయులతో, పలమనగళంలో ముస్లింలతో మాట్లాడారు.
సత్యవేడు నియోజకవర్గం, విత్తలతడుకు క్యాంప్ సైట్ నుండి 19వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ గారు తనకు ఎదురైన చిన్న పెద్దా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ... వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రజలు కూడా ఆయనను ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. pic.twitter.com/Z8XCw1Dq7O
— Telugu Desam Party (@JaiTDP) February 14, 2023
మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీ
పాదయాత్రలో భాగంగా చినరాజకుప్పంలో మాట్లాడిన లోకేశ్.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేతన్నలను, రైతులను మోసం చేశారని, సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని, రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.4,65,860 కోట్లు,కార్పొరేషన్ల రుణాలు రూ.1,78,603 కోట్లు, నాన్ గ్యారెంటీ రుణాలు రూ.87,233 కోట్లు,పెండింగ్ బిల్లులు రూ.1,85,000 కోట్లు.మొత్తం అప్పు రూ. 9,16,696 కోట్లు.కానీ దొంగ లెక్కలు చూపించి ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లే అంటూ అందరినీ మోసం చేస్తున్నారు జగన్ pic.twitter.com/MzBW6bvpx5
— Telugu Desam Party (@JaiTDP) February 14, 2023
తిరుపతి టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ
పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్ ను కలిశారు. విత్తలతుడుకు క్యాంప్ ఆఫీసులో నారా లోకేశ్ ను టీడీపీ నేతలు కలిశారు. యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్ర ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహా యాదవ్, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ఏర్పాట్లను నారా లోకేశ్ కు వారు వివరించారు.