Viral News: కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కింద పడిన మహిళ, దూసుకెళ్లిన రైలు - కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావం
Mumbai Local Train: ముంబయిలో ఓ మహిళ కదులుకున్న రైల్ ఎక్కబోయి ట్రాక్‌పై పడిపోయింది. రైలు దూసుకెళ్లడం వల్ల ఆమె కాళ్లు పూర్తిగా తెగిపోయాయి.
Viral News in Telugu: రైల్ ట్రాక్‌లను దాటొద్దని, ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. రైల్ ఎక్కే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని, కదిలే ట్రైన్ ఎక్కొద్దని అనౌన్స్‌మెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు కొందరు ప్రయాణికులు. ముంబయిలోని బేలాపూర్ స్టేషన్‌లో ఓ మహిళ రైల్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే జనం కిక్కిరిసి ఉన్నారు. ట్రైన్ కదులుతున్నా అలాగే ఎక్కాలని చూసింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పట్టుతప్పి కింద పడిపోయింది. నేరుగా ట్రాక్‌పైనే పడిపోయింది. ఓ బోగీ కదిలాక వెంటనే గమనించిన అధికారులు అలారం ఇచ్చారు. అప్పటికప్పుడు ట్రైన్ ఆగిపోయి వెనక్కి మళ్లింది. ఒక్కసారిగా ప్రయాణికులంతా మహిళ పరిస్థితిని చూసేందుకు ఎగబడ్డారు. పోలీసులు అప్రమత్తమై అందరినీ దూరంగా పంపించారు. అదృష్టం కొద్దీ ప్రాణాలు దక్కినా కాళ్లు మాత్రం పూర్తిగా నలిగిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రక్తపు మడుగులో ఉన్న మహిళను వెంటనే హాస్పిటల్‌కి తరలించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. రైల్ వస్తున్నా పట్టించుకోకుండా ట్రాక్‌లు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య ఓ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ట్రైన్ వస్తున్నా కూడా నిర్లక్ష్యంగా అలాగే ట్రాక్‌పైకి దూసుకొచ్చాడు. సరిగ్గా ప్లాట్‌ఫామ్ ఎక్కే సమయానికి చెప్పు పట్టాలకు తగిలి ఊడిపోయింది. ఆ చెప్పు కోసం వెతుక్కుంటూ అక్కడే ఉండిపోయాడు. ట్రైన్ దూసుకొస్తున్నా అక్కడి నుంచి బయటపడలేదు. చివరకు సరిగ్గా అది వచ్చే టైమ్‌కి ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. అక్కడే ఉన్న RPF పోలీస్ అతడిని గమనించి వెంటనే పైకి లాగాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. కాపాడిన వెంటనే ఆ పోలీస్ ఆ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది.