Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా మరోసారి ముకుల్ రోహత్గి!
Mukul Rohatgi: ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్‌గా నియమితులు కానున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది.
Mukul Rohatgi: సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి (67) మరోసారి అటార్నీ జనరల్ (ఏజీ)గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ రిటైర్మెంట్ తర్వాత రోహత్గి ఈ బాధ్యతలను చేపట్టనున్నారు.
ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం సెప్టెంబర్ 30కి ముగుస్తుంది. వేణుగోపాల్ పదవీకాలాన్ని మూడు నెలల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగిస్తున్నట్లు ఈ ఏడాది జూన్ చివర్లో ప్రకటించారు. ఈ పొడిగింపు గడువు సెప్టెంబర్ 30న ముగుస్తుంది. అనంతరం రోహత్గి 16వ అటార్నీ జనరల్ కానున్నట్లు తెలుస్తోంది. ముకుల్ రోహత్గి అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్‌కు సమాచారం అందింది.
గతంలో
రోహత్గి 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. రోహత్గి 2017లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడంతో 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను నాడు ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని పొడిగించారు. అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆయన ఈ పదవిలో దాదాపు 5ఏళ్లుగా కొనసాగుతున్నారు.
కేంద్రం విజ్ఞప్తితో
2020లోనే వేణుగోపాల్ మూడేళ్ల పదవీకాలం ముగిసింది. అప్పటికే ఆయన వయస్సు దాదాపు 89 ఏళ్లు. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతిని ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్ కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం ఆయన్ను మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగమని అభ్యర్థించడంతో ఆయన కొనసాగారు.
రోహత్గి ప్రొఫైల్
- రోహత్గి ముంబయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు.
- చదువు పూర్తి చేసిన తర్వాత ఆయన యోగేష్ కుమార్ సబర్వాల్ ఆధ్వర్యంలో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు.
- రోహత్గి.. హైకోర్టులో సబర్వాల్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేశారు.
- 1993, జూన్ 3న దిల్లీ ప్రభుత్వం ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది.
- 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో రోహత్గి అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు.
- 2004 నుంచి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపిఏ) ప్రభుత్వాన్ని గద్దె దించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే రోహత్గి 2014లో దేశానికి అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులయ్యారు.
- అయితే రోహత్గీ 2017 జూన్ రెండో వారంలో అటార్నీ జనరల్ పదవికి రాజీనామా చేసి తన ప్రైవేట్ ప్రాక్టీస్‌కు తిరిగి వచ్చారు. సుప్రీం కోర్టులో ఉన్న ప్రముఖ న్యాయవాదుల్లో రోహత్గి ఒకరు. దేశంలోని పలువురు ప్రముఖుల కేసులను ఆయన వాదించారు.
Also Read: Kerala: ఓరి దేవుడా! అవి కుక్కలా లేక పులులా? కుర్రాళ్ల టైం బావుంది!
Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో జేబు దొంగల హల్‌చల్- పోలీసులకు కొత్త కష్టాలు!