Bharat Jodo Yatra: జోడో యాత్రలో జేబు దొంగల హల్‌చల్- పోలీసులకు కొత్త కష్టాలు!
Bharat Jodo Yatra: కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో జేబు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతోన్న 'భారత్ జోడో యాత్ర'కు కొత్త కష్టాలు వచ్చాయి. ఈ యాత్రకు రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. దీంతో జేబు దొంగలు చేతివాటం చూపిస్తున్నారు.
పిక్ పాకెటింగ్
జోడో యాత్రకు పెద్దఎత్తున ప్రజల రాకను అవకాశంగా మలచుకొని.. జేబు దొంగలు వారిలో కలిసిపోయి పిక్ పాకెటింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జోడో యాత్ర కేరళకు చేరుకుంది. కేరళలో ఇటీవల రెండు, మూడు రోజుల్లో యాత్ర కొనసాగిన ప్రాంతాల్లో జేబు దొంగతనం కేసులు నమోదయ్యాయని కరమన పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు సంబంధిత ఘటనలు జరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ముఠా
సీసీటీవీ ఫుటేజీలో నలుగురు సభ్యుల ముఠా కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. వీరు పాదయాత్రలో భాగం కాదన్నారు. వీరు ఎక్కడి వారనే విషయం కచ్చితంగా తెలియదన్నారు.
జోడో యాత్ర
మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.
కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం జోడో యాత్ర కేరళకు చేరుకుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.
Also Read: Ajit Pawar: 'వాష్‌రూమ్‌కు వెళ్తే వార్తలు రాసేశారు! పార్టీపై నాకేం కోపం లేదు'
Also Read: Congress: నిక్కర్‌కు నిప్పంటించిన కాంగ్రెస్- చెలరేగిన రాజకీయ దుమారం!