Morbi Bridge Case: అంతా మీరే చేశారు, బ్రిడ్జ్ రిపేర్ చేసిన సంస్థపై మోర్బి మున్సిపాలిటీ ఫైర్
Morbi Bridge Case: మోర్బి వంతెన కూలటానికి రిపేర్ చేసిన సంస్థే కారణమని మున్సిపాల్టీ అధికారులు ఆరోపిస్తున్నారు.
Morbi Bridge Case:
ఎలాంటి సమాచారం ఇవ్వలేదు..
అక్టోబర్ 30వ తేదీన గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటనపై ఇంకా వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ వేగంగా కొనసాగుతోంది. అయితే...తప్పు మీదంటే మీది అని మున్సిపాల్టీ అధికారులు, మేనేజ్‌మెంట్ సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే కాలం అంతా గడిచిపోతోంది. ముఖ్యంగా మోర్బి మున్సిపాల్టీ...తప్పంతా అజంతా మానుఫాక్చరింగ్ లిమిటెడ్ (ఒరెవా గ్రూప్)దేనని తేల్చి చెబుతోంది. ఎలాంటి ఫిట్‌నెస్ టెస్ట్ చేయకుండానే
బ్రిడ్జ్‌ను తెరిచారని ఆరోపిస్తోంది. గుజరాత్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేసింది. ఈ ఘటనలో 135 మంది మృతి చెందారు. ఈ కేసుని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపడుతోంది. "మోర్బి మున్సిపాలిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, ఎలాంటి అప్రూవల్ లేకుండానే వంతెనకు మరమ్మతులు చేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రాకముందే బ్రిడ్జ్‌ని తెరిచారు. దాని కెపాసిటీని కూడా సరైన విధంగా అంచనా వేయలేకపోయారు" అని మోర్బి మున్సిపాల్టీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ విచారణ జరిగే సమయంలో కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. "ఇంత ముఖ్యమైన పనిని చేసేందుకు కేవలం ఒకటిన్నర పేజీల్లోనే అగ్రిమెంట్ ఎలా చేశారు..? ఎలాంటి టెండర్ వేయకుండానే నేరుగా అజంతా కంపెనీకే ఈ పని అప్పగించటం వెనక అర్థమేంటి..?" అని ప్రశ్నించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరు విభాగాల నుంచి సమాధానాలు కావాలని కోర్టు ఆదేశించింది.
విచారణ..
గుజరాత్ సర్కార్‌పైనా హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. బ్రిడ్జ్ మరమ్మతు, నిర్వహణ కోసం కాంట్రాక్టు ఇచ్చిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. మోర్బి వంతెన కూలిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ జలా నుంచి నాలుగు గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ విచారణ పూర్తైన వెంటనే కీలక నిర్ణయం వెలువడింది. Urban Development Department సందీప్ సింగ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. State Disaster Commissioner హర్షద్ పటేల్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. గాలింపు చర్యల్ని నిలిపివేయాలని ఆదేశించారు. మోర్బి వంతెన కూలిన ఘటనలో విచారణ వేగంగా సాగుతోంది. ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్
బాధ్యతలు చూసుకుంటున్న మేనేజర్ సహా ఇతర సిబ్బందిని ఇప్పటికే విచారించారు. ఆ తరవాత మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సందీప్ సింగ్‌ను విచారించారు. దాదాపు 4 గంటల పాటు ఇది కొనసాగింది. స్థానిక కంపెనీ Orevaతో కుదిరిన ఒప్పందంపై ప్రశ్నించారు పోలీసులు. ఆ తరవాత లోకల్ కోర్ట్‌కు ఈ విచారణకు సంబంధించినడాక్యుమెంట్లు సమర్పించారు. ఇందులో తేలిందేంటంటే...ఈ బ్రిడ్జ్ మరమ్మతుల కోసం ఓ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అయితే...ఈ కాంట్రాక్టర్లకు బ్రిడ్జ్‌ను మరమ్మతు చేయటమెలాగో పూర్తి స్థాయిలో అవగాహన లేనే లేదు. అంతకు ముందెన్నడూ వాళ్లు అలాంటి పనులు చేయలేదు. కేవలం బ్రిడ్జ్‌కు ఉన్న కేబుల్స్‌ను పాలిష్ చేసి పెయింటింగ్ చేసి వదిలేశారు. ఈ కంపెనీ ఈ బ్రిడ్జ్ రిపేర్ చేయడానికి పూర్తిగా అనర్హం అని విచారణలో తేలింది.
Also Read: Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసు నిందితుడికి కస్టడీ పొడిగింపు- నార్కో టెస్ట్‌కు అనుమతి