Maoists Another proposal: ఫిబ్రవరికల్లా ఆయుధాలు వదిలేస్తాం వేటాడవద్దు - 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల బహిరంగ లేఖ!
Maoists : ఆయుధాలను వదిలేస్తామని సమయం ఇవ్వాలని మావోయిస్టులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కానీ కేంద్రం మార్చి 31వరకు డెడ్ లైన్ పెట్టుకుంది.

Maoists letters to government: ఆపరేషన్ కగార్‌తో కకావికలం అవుతున్న మావోయిస్టులు చివరి ప్రయత్నంగా మరో సారి ప్రభుత్వాలకు లేఖలు రాశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తే, ఆయుధాలు వదిలేస్తామని ప్రతిపాదించారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట విడుదలైన ఈ లేఖలో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, ఆయుధాలు త్యజించాలని పార్టీ నాయకత్వం ఇటీవల తీర్మానించిందని లేఖలో తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్ , చంద్రన్న కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారని, ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం ఆయుధాలు వదిలేయాలని భావిస్తోందని పేర్కొన్నారు.
అయితే, ఈ నిర్ణయాన్ని సమష్టిగా అమలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. పార్టీ సహచరులను సంప్రదించి పద్ధతి ప్రకారం సందేశాలు తెలియజేయడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఈ సమయాన్ని అడగడానికి ఇతర ఉద్దేశాలు లేవని, త్వరగా కమ్యూనికేట్ చేయడానికి వేరే సులభ మార్గాలు లేకపోవడమే కారణమని స్పష్టం చేశారు.
లేఖలో మావోయిస్టులు భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తే, మా అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిలిపేస్తామని హామీ ఇచ్చారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను నిర్వహించబోమని, ఆయుధాలు త్యజించే తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ హామీతో పాటు, మూడు రాష్ట్రాల్లోని భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు తాత్కాలికంగా ఆపేసి, మావోయిస్టులకు సమయం కల్పించాలని కోరారు.
గత కొన్ని రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లోనే గతేడాది 200కి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారు. పార్టీ కేంద్ర కమిటీ నుంచి వచ్చిన ఈ నిర్ణయం, మావోయిస్టు ఉద్యమానికి ముగింపుగా మారవచ్చని భావిస్తున్నారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు లేదా కేంద్ర భద్రతా సంస్థలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే కేంద్రం మాత్రం ఎలాంటి మినహాయిపులు ఇచ్చేది లేదని.. అయితే లొంగిపోవాలి లేకపోతే ఎన్ కౌంటర్ కావాలన్నట్లుగా పాలసీ తీసుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా వరుసగా హ తమవుతున్నారు. అనేక కీలక దాడులకు నేతృత్వం వహించిన హిడ్మా లాంటి వాళ్లు కూడా ఎన్ కౌంటర్ కావడంతో మిగిలిన వారు భరోసాగా ఉండలేకపోతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. లేకపోతే మార్చి 31 నాటికి నక్సలైట్లు అనే వాళ్లు లేకుండా నిర్మూలిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే ఆయుధాలు వదిలేస్తామని సంకేతాలు పంపించారు. కానీ ప్రభుత్వాల వైపు నుంచి స్పందన రావడం మాత్రం అసాధ్యం అనుకోవచ్చు.




















