మణిపూర్‌లో మళ్లీ అలజడి, భద్రతా బలగాలు కుకీ వర్గానికి మధ్య కాల్పులు- కమాండో మృతి
Manipur Violence: మణిపూర్‌లో కుకీ, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కమాండో మృతి చెందాడు.
Moreh Gunfight:
మళ్లీ హింస..
మణిపూర్‌లో మరోసారి అలజడి (Manipur Violence) రేగింది. కుకీ వర్గానికి చెందిన కొందరు భద్రతా బలగాలపై దాడులు చేశారు. ఇటు భద్రతా బలగాలూ ఎదురు కాల్పులు జరిపారు. తెంగ్‌నౌపల్ జిల్లాలో మోరె ప్రాంతం వద్ద ఈ కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ పోలీస్ కమాండో మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...కుకీ తెగకు చెందిన కొందరు భద్రతా బలగాలపై ఒక్కసారిగా దాడి చేశారు. బాంబులు విసిరారు. ఆ తరవాత కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా దళాలు కూడా అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపింది. ఈ క్రమంలోనే ఓ కమాండో మృతి చెందాడు. మరో కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు గంట పాటు ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇదే మోరే ప్రాంతంలో రెండ్రోజుల క్రితం ఓ పోలీస్ ఆఫీసర్ హత్యకు గురయ్యాడు. ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీళ్లు పోలీసులు అదుపులో ఉండగానే ఈ దాడి జరిగింది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కర్ఫ్యూ విధించింది. గతేడాది అక్టోబర్‌లో ఓ పోలీస్ అధికారిని ఇద్దరు దారుణంగా హత్య చేశారు. వాళ్లను అదుపులోకి తీసుకునే క్రమంలోనే ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఇద్దరూ ఉన్నట్టుండి పోలీస్ వాహనాలపై దాడి చేశారు. అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. దాదాపు 9 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంచారు. వాళ్లను వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి నినాదాలు చేశారు.
ఈ నెల 2వ తేదీన కూడా హింస చెలరేగింది. పోలీస్ దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. దీంతో తౌబాల్ తో పాటు ఇంఫాల్ ఈస్ట్ , ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వద్ద డబ్బులు దోచుకునేందుకే దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కార్లలో వచ్చిన నిందితులు ఘర్షణకు దిగగా, స్థానికులు వారిని తరిమికొట్టారు. అయితే, పారిపోతూ వారు కాల్పులు జరిపినట్లు చెప్పారు. కార్లను అక్కడే వదిలి నిందితులు పరారీ కాగా, స్థానికులు ఆగ్రహంతో వారి కార్లను తగలబెట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ప్రభుత్వం ప్రభావిత జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది.