Kharge - MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కాల్ చేసిన ఖర్గే! కాంగ్రెస్ ఏం ప్లాన్ చేస్తోంది?
Kharge - MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మల్లికార్జున్ ఖర్గే కాల్ చేసినట్టు తెలుస్తోంది.
Kharge - MK Stalin:
త్వరలోనే భేటీ..?
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. విపక్షాలు ఒకేతాటిపైకి రావడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న కాంగ్రెస్...క్రమంగా అన్ని పార్టీలతో మైత్రి పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే...కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కాల్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు రావాలని ఆహ్వానించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలో ఓ సారి సమావేశం జరిగింది. ఈ సారి ఖర్గే ఆధ్వర్యంలో భేటీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో డీఎమ్‌కేతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. జాతీయ స్థాయిలోనూ ఇదే విధంగా కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే...రెండు పార్టీలు పరస్పరం మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే...ఖర్గే నేతృత్వంలో ఎప్పుడు, ఎక్కడ ఈ సమావేశం జరుగుతుందన్న సమాచారం ప్రస్తుతానికి లేదు. డీఎమ్‌కేతో పాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, వామపక్ష పార్టీలకూ కాంగ్రెస్ ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. ఆ పార్టీలన్నీ సానుకూలంగా స్పందించాకే ఈ భేటీ జరగనుంది.
బీజేపీపై పోరాటం..
అదానీ వ్యవహారంలోనూ విపక్షాలన్నీ ఒక్కటై కేంద్రంపై నిరసన వ్యక్తం చేశాయి. పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు చేపట్టాయి. 2024 ఎన్నికల వరకూ ఇదే విధంగా కలిసి నడవాలన్న ఆలోచనతో ఉన్నాయి అన్ని పార్టీలు. అయితే..2014 నుంచి ప్రధాని మోదీ చరిష్మా పెరుగుతూ వచ్చింది. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయం సాధించింది. ప్రతిపక్షాలకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ సారి విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే బీజేపీని ఢీకొట్టడం సులభం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
కొన్ని పార్టీలు విభేదాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నాయి. రాహుల్ అనర్హతా వేటుపై పార్లమెంట్‌లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి..? బీజేపీతో ఎలా పోరాడాలి..? అనే అంశాలపై ఇటీవలే కాంగ్రెస్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో డీఎమ్‌కే, ఎస్‌పీ, జేడీయూ, బీఆర్‌ఎస్, సీపీఎమ్ సహా మొత్తం 17 పార్టీలు కాంగ్రెస్‌కు అండగా నిలిచాయి. అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ నేతలూ హాజరవడం. మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది TMC.ప్రతిపక్షాల వ్యూహాలపై జరిగిన కీలక సమావేశంలో తృణమూల్ నేతలు హాజరవడం ఆసక్తికరంగా మారింది. ఎవరి ఐడియాలజీ వారిదే అయినప్పటికీ...ఈ సమయంలో అన్ని పార్టీలు ఏకం అవడం చాలా ముఖ్యం అని, బీజేపీపై పోరాడడానికి ఇదే మంచి తరుణం అని చెబుతోంది కాంగ్రెస్. బీజేపీపై పూర్తి స్థాయి పోరాటం మొదలు పెట్టిన కాంగ్రెస్‌పై TMCకి కాస్త నమ్మకం ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. దీనిపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునే ఏ పార్టీకైనా ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేశారు.