Maha Shivratri 2023: శ్రీశైలంలో రెండోరోజు ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ లవన్న తమ వ్యక్తిగతంగా శ్రీస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
Maha Shivratri 2023 Srisailam Brahmotsavam second day : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ లవన్న తమ వ్యక్తిగతంగా శ్రీస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ ( AP Minister Kottu Satyanarayana) దంపతులకు దేవస్థానం అధికారులకు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న చైర్మన్ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆదివారం జరిగే బృంగి వాహన సేవ ( Brungi Vahana Seva )లో మంత్రి దంపతులు పాల్గొన్నారు.
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి రెండవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామివారు బృంగి వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో బృంగివాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివేళ్ళగా రాజగోపురం గుండ బృంగివాహనాదీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారించేందుకు బృంగివాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మొదటిరోజు శ్రీకాళహస్తీ దేవస్థానం తరుపున కాళహస్తి ఈవో విజయసాగర్ బాబు దంపతులు చైర్మన్ శ్రీనివాసులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..
ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు శ్రీశైలం ఆలయ ఈవో ఎస్.లవన్న,చైర్మన్ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో విజయసాగర్ బాబు,అర్చకులు, అధికారులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు. అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో లవన్నకు చైర్మన్ కు శ్రీకాళహస్తి ఈవో విజయసాగర్ బాబు శేష వస్త్రాలతో సత్కరించారు.