Lok Sabha Election Schedule: ఇవాళే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్, అధికారికంగా ప్రకటించనున్న ఈసీ
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని ఇవాళ ఈసీ అధికారికంగా విడుదల చేయనుంది.
Lok Sabha Elections Schedule: పొత్తులు, కూటములు, కలవడాలు, విడిపోవడాలు..దేశ రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అందుకు కారణం లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) సమీపిస్తుండడమే. హ్యాట్రిక్ సాధించాలని మోదీ సర్కార్ చాలా గట్టిగా ప్రయత్నిస్తుంటే..మిగతా ప్రతిపక్షాలు NDAకి గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్నాయి. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల కన్నా ఈ సారి ఆసక్తి రెట్టింపైంది. అందుకే నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు పార్టీలతో పాటు ఇటు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని (Lok Sabha Election 2024 Schedule) అధికారికంగా విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ వివరాలు (Lok Sabha Polling 2024 Dates) వెల్లడి కానున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించింది. అక్కడి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. స్థానిక ఎన్నికల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. పోలింగ్ బూత్‌లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. వయసు రీత్యా పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేసే అవకాశం లేని వాళ్లు ఇంట్లో నుంచే ఓటు వేసేలా వెసులుబాటు కల్పించాలని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలూ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు ఈసీ ఇప్పటికే వెల్లడించింది. 2019 నాటి ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ సారి ఓటర్ల సంఖ్య 6% మేర పెరిగినట్టు స్పష్టం చేసింది.
టెక్నాలజీ సాయంతో...
ఎన్నికల ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌నీ వినియోగించుకోనుంది ఈసీ. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియని జరపాలంటే కచ్చితంగా ఇలాంటి సాంకేతికత అవసరం అని భావిస్తోంది. ఇక సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడంపైనా కాస్త కఠినంగానే వ్యవహరించనుంది. నిజానికి ఎన్నికల షెడ్యూల్ విషయంలోనే సోషల్ మీడియాలో ఇప్పటి వరకూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ వదంతులేనంటూ స్వయంగా ఈసీ వివరణ ఇచ్చింది. అయితే...ఇటీవల ఎన్నికల సంఘ కమిషనర్ అరుణ్ గోయల్ ఉన్నట్టుండి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ఈ కారణంగా ఎన్నికల షెడ్యూల్ ఏమైనా ఆలస్యమవుతుందేమోనని అంతా భావించారు. కానీ వెంటనే ఇద్దరు కమిషనర్లను నియమించి అనుకున్న తేదీనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమైంది ఈసీ. కేరళకి చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధుని కమిషనర్లుగా నియమించింది సెలెక్షన్ కమిటీ. ఇప్పటికే వీళ్లిద్దరూ బాధ్యతలు తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ సీఈసీ రాజీవ్ కుమార్‌కి వీళ్లిద్దరూ సహకరించనున్నారు. ఈ నియామకంపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. అంతా హడావుడిగా పూర్తి చేశారని మండి పడింది. ఈ వాదనలు ఎలా ఉన్నా...బీజేపీ హ్యాట్రిక్‌కి గురి పెట్టడం, కాంగ్రెస్‌కి చావో రేవో అనే పోరాటం కావడం వల్ల ఈ ఎన్నికలపై మాత్రం మునుపటి కన్నా ఆసక్తి పెరిగింది.