Asifabad Accident: ఆసిఫాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! స్పాట్‌లోనే తల్లీ కొడుకుల మృతి
Telangana News: ప్రమాదం జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. రోడ్డుపై చెల్లా చెదురుగా పడిన మృతదేహాలను సైతం అక్కడి వారు చూడలేకపోయారు.
Komaram Bheem Asifabad News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం (జనవరి 21) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగజ్ నగర్ మండలం భట్టుపల్లికి చెందిన తండ్రి, కొడుకు, తల్లి ముగ్గురు పనినిమిత్తం అసిఫాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్ళారు. తమ పని ముగించుకొని తిరిగి బైకుపై వెళుతుండగా ఆసిఫాబాద్ లోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఓ లారీ వారి బైక్ ను ఢీ కొట్టింది. వెనుక నుండి మరోలారి ఆ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న తల్లి షేక్ భాను, కొడుకు షేక్ ఆసీఫ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
ప్రమాదం జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. రోడ్డుపై చెల్లా చెదురుగా పడిన మృతదేహాలను సైతం అక్కడి వారు చూడలేకపోయారు. అంతా వారి శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఇద్దరి మృత దేహలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఘటనా స్థలానికి వచ్చి మృతుల వివరాలను కనుక్కున్నారు. ప్రమాదంలో గాయపడిన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి కుడుకులు మృతి చెందడంతో బోరున విలపించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలన్నారు. గాయపడ్డ తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని బందువులు కోరారు.