Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
Andhra Pradesh News | ఏపీలో మరో దారుణం జరిగింది. లా స్టూడెంట్ పై నలుగురు యువకులు గత కొన్ని నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. వీడియోలు ఉన్నాయంటూ బెదిరించి ఆమెకు నరకం చూపించారు.
AP Home minister Vangalapudi Anitha | విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా మరో దారుణం విశాఖపట్నంలో జరిగింది. తెలిసిన వాడే, అది కూడా మనసిచ్చిన వాడే కామాంధుడిగా మారాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి అది సామూహిక అత్యాచారానికి దారితీయడం, పదే పదే ఈ దారుణం జరగడం విశాఖలో కలకలం రేపుతోంది. నీ వీడియోలు మా వద్ద ఉన్నాయంటూ లా స్టూడెంట్ పై ప్రేమికుడు, అతడి స్నేహితులు కొన్ని నెలల నుంచి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. వేధింపులు భరించలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
విశాఖపట్నంలో లా (Law Course) చదువుతోన్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు. యువతిపై అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ ఫొటోలు వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెకు నరకం చూపించారు. చివరికి బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఘటన వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే..
బాధిత యువతి మధురవాడలో లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. వంశీతో కుదిరిన స్నేహం అనంతరం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకువెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటాను ఏం ఇబ్బంది ఉండదంటూ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మరో మూడు రోజుల తరువాత తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతడి స్నేహితులు రాజేష్, ఆనంద్, జగదీష్ యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. యువతిపై దారుణానికి పాల్పడుతుండగా వీడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని బాధితురాలికి నరకం చూపిస్తున్నారు.
తమ కోరిక తీర్చాలని లేకపోతే ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని భయపెట్టారు. ఈ విషయాన్ని బాధితురాలు వంశీకి చెప్పడంతో వారు చెప్పినట్లు చేయమని ఒత్తిడి చేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు భరించలేక నవంబర్ 18న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేయగా, ఇది గమనించిన తండ్రి ఆమెను అడ్డుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని, ఎదుర్కొన్న భయానక పరిస్థితులను తండ్రికి చెప్పి కన్నీటిపర్యంతమైంది. ఆమె ఫ్యామిలీ విశాఖ టూ టౌన్ పోలీసులకు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
కఠినంగా శిక్షించాలని పోలీసులకు హోం మంత్రి ఆదేశాలు
విశాఖలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచార ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి, కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు హోం మంత్రి అనిత. విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను హోం మంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాల కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తేలేదన్నారు వంగలపూడి అనిత.