లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టుకి కేజ్రీవాల్, అరెస్ట్‌ని సవాల్ చేస్తూ పిటిషన్
Liquor Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Delhi Liquor Policy Case: లిక్కర్ పాలసీ స్కామ్‌లో (Delhi Liquor Policy Scam) అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్‌పై బయటకు రావాలని చూస్తున్నా అందుకు లైన్ క్లియర్ కావడం లేదు. ఇటీవలే అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత లోక్‌సభ ఎన్నికలు మొదలు కానున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన జైల్‌లో ఉండడం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద సవాలు కానుంది. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా ఉన్నారని తేల్చి చెప్పింది హైకోర్టు. పాలసీ రూపకల్పనలోనూ ఆయన హస్తం ఉందని స్పష్టం చేసింది. కొంత మందికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడమే కాకుండా వాళ్ల నుంచి భారీ ముడుపులు తీసుకున్నట్టు ఈడీ వివరించినట్టు వెల్లడించింది. ఈడీ రిమాండ్‌ని అక్రమమని చెప్పలేమని, ఆయనను అరెస్ట్ చేయడం చట్ట ఉల్లంఘన అని కూడా అనలేమని స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తమ న్యాయ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆప్ నేతలు బీజేపీపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కుట్ర అని తేల్చి చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ని ఉద్దేశపూర్వకంగానే జైల్‌లో పెట్టించారని మండి పడుతున్నారు. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఇప్పటికే రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని అనధికారికంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఆరు హామీలను ప్రకటించారు. త్వరలోనే కేజ్రీవాల్ జైల్ నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

