Karnataka Congress MLAs Resign: కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!
DK Shivakumar Cabinet Expansion Crisis: కర్ణాటక డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలూ అదే బాటలో ఉన్నారు.

Karnataka Congress Cabinet Rebellion: కర్ణాటక రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో నూతన క్యాబినెట్‌లో తమకు స్థానం లభించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారు. సోమవారం నూతన మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొద్ది గంటల ముందు ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి.పాటిల్, సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కన్నడ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టించింది.
ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్ విధాన సౌధలో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణిని స్వయంగా కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దశాబ్దాలుగా పార్టీకి నమ్మకమైన సేవకులుగా ఉన్నప్పటికీ అధిష్ఠానం తమ పట్ల తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాటిల్ రాజీనామా వార్త వెలువడగానే బెంగళూరు వీధుల్లో ఆయన మద్దతుదారులు, అనుచరులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల్లో ధర్నాలు నిర్వహించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరొకవైపు, సాగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన బెళూరు గోపాలకృష్ణ సైతం శాసనసభ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం మరింత తీవ్రతరమైంది. వీరితో పాటు మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డ మరికొందరు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సైతం తమ అనుచరులతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రాంతీయ, సామాజిక సమీకరణాల పేరుతో తమను పక్కనపెట్టి ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి రగులుతోంది.
మొత్తం 20 మందితో నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లోక్ భవన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిన తరుణంలో ఈ సడన్ రాజీనామాలు కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారాయి. సీఎం డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత జరుగుతున్న ఈ విస్తరణ.. పార్టీలో ఐక్యతను తెచ్చేందుకు బదులు తీవ్ర అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం , సీఎం డీకే శివకుమార్ అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు శరవేగంగా రాయబారాలు ప్రారంభించారు.
ಶಾಸಕ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜೀನಾಮೆ ನೀಡಿದ ಯಶವಂತರಾಯ ಗೌಡ ಪಾಟೀಲ್ | Guarantee News https://t.co/gLRDTHWRPE #guaranteenews #YashavantrayGoudPatil #KarnatakaPolitics #Congress #KarnatakaCabinet #CabinetExpansion #DKShivakumar #guaranteenewskannada pic.twitter.com/hUWjHW9VVN
— Guarantee News (@GuaranteeN26064) August 3, 2026
రాబోయే శాసనసభ సమావేశాలు, పరిపాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సొంత ఎమ్మెల్యేల రాజీనామాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర ప్రతిరక్షణలో పడేశాయి. ఈ తిరుగుబాటు మరింత విస్తరిస్తే ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో, సీఎం డీకే శివకుమార్ , కాంగ్రెస్ అధినాయకత్వం ఈ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు






















