Karnataka Cabinet : మొన్నటి దాకా పదవులు.. ఇప్పుడు శాఖలు ! బొమ్మైకు బొమ్మ చూపిస్తున్న మంత్రులు!
ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఫిరాయింపులు దారులు తమకు కీలక శాఖలు కావాలని బొమ్మైపై ఒత్తిడి తెస్తున్నారు. ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కర్ణాటక మంత్రివర్గాన్ని అతి కష్టం మీద విస్తరించిన ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మైకి మంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రాధాన్య శాఖలు ఇవ్వలేదని.. తాము రాజీనామా చేస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ఎం.టి.బి నాగరాజుకు మున్సిపల్ వ్యవహారాల శాఖ ఇచ్చారు. కానీ ఆయనకు మాత్రం. ఆహార, పౌర సరఫరాల శాఖ కావాలని ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీని కాదని వచ్చినప్పుడు అదే శాఖని ఇస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు మాత్రం ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారని ఆయన మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు చూసి.. శాఖ మార్చకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిజానికి కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ హయాంలోనూ ఎంటీబీ నాగరాజ్ మంత్రే.
కానీ బీజేపీ ఆకర్ష్‌లో పడిపోయి ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు కోరిన శాఖ దక్కలేదని రగిలిపోతున్నారు. చివరికి గాలి జనార్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు బి.శ్రీరాములు కూడా తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పడం లేదు. కానీ ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. కానీ శ్రీరాములుకు పెద్దగా ప్రాధాన్యం ఉండని రవాణా శాఖను ఇచ్చారు. దీంతో చక్రం తిప్పడానికి ఏమీ ఉండదని వారు బాధపడుతున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. రమేషే జార్కిహోళి అశ్లీల సీడీ బయట పడినప్పుడు.. ఆరుగురు మంత్రులు తమ సీడీల్ని బయట పెట్టవద్దని కోర్టుకెళ్లారు. ఆరోపణలు లేని వారికే మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ అనుకుంది. కానీ వారికి మంత్రి పదవులు ఇవ్వకపోతే.. మొదటికే మోసం వస్తుందని ఇచ్చారు. వారికి ప్రాధాన్య శాఖలు కూడా కల్పించారు. ఇప్పుడు అసంతృప్త వాదులందరితోనూ మాట్లాడేందుకు బొమ్మై ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అనిశ్చితిగానే ఉంటోంది. యడ్యూరప్ప రెండేళ్లు ఉన్నా.. దిన దిన గండం అన్నట్లుగానే పాలన సాగింది. చివరికి ఎలాగోలా నెట్టుకొచ్చినా ఇప్పుడు బ్యాటన్‌ను వేరే వారికి ఇవ్వక తప్పలేదు. బొమ్మై.. అందరికీ పైకి ఆమోదయోగ్యుడే కానీ.. అందరూ తాము ఆయన కంటే సీనియర్లమని అనుకునే పరిస్థితి ఉంది. ఆయన స్వతహాగా బీజేపీ నేత కాదు. దీంతో ఆరెస్సెస్‌లో పుట్టి పెరిగిన బీజేపీ నేతలు.. తమకు మరింత ప్రాధాన్యం కావాలని కోరుకుంటున్నారు. వారందర్నీ సముదాయించడం ఇప్పుడు బొమ్మైకు తలకు మించిన భారమవుతోంది. అందర్నీ బుజ్జగించేందుకు హైకమాండ్ ప్రత్యేక దూతల్ని పంపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. శాఖలను కూడా హైకమాండ్ సూచించిన వారికే ఇచ్చానని తన సొంత అభిప్రాయం లేదని బొమ్మై అసంతృప్త వాదులకు చెబుతున్నట్లుాగ తెలుస్తోంది.