బజ్‌రంగ్ దళ్‌లోనూ మంచి వాళ్లుంటారు, బ్యాన్ చేసే ఆలోచన లేదు - దిగ్విజయ్ సింగ్
Bajrang Dal Ban: బజ్‌రంగ్ దళ్ బ్యాన్‌పై కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bajrang Dal Ban:
బజ్‌రంగ్ దళ్ నిషేధం..!
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బజ్‌రంగ్ దళ్ బ్యాన్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలోనే బజ్‌రంగ్ దళ్‌ని నిషేధిస్తాం అంటూ ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అందుకు బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. బజ్‌రంగ్ దళ్ వాళ్లు కూడా రోజంతా హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటకలో మాత్రమే కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిషేధం విధిస్తారన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినా...బజ్‌రంగ్ దళ్‌ని బ్యాన్ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. కానీ...సమాజంలో అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే వాళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం అని స్పష్టం చేశారు. బజ్‌రంగ్ దళ్ వాళ్లే ఇలాంటి చర్యలు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అయితే...ఇందులోనూ కొందరు మంచి వ్యక్తులుంటారని, నిషేధం విధించడం సరికాదని వెల్లడించారు. ఇదే సమయంలో హిందుత్వం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దిగ్విజయ్ సింగ్.
"మేం అధికారంలోకి వస్తే బజ్‌రంగ్ దళ్‌ని బ్యాన్ చేయం. ఈ దళంలోనూ కొందరు మంచి వ్యక్తులుంటారు. కానీ...హింసను రెచ్చగొట్టి విద్వేషాలు వ్యాప్తి చేస్తే వాళ్లెవరైనా సరే వదిలిపెట్టం. నేనో హిందువుని. ఎప్పటికీ హిందువునే. హిందూ సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను. చెప్పాలంటే..నేను బీజేపీ నేతల కన్నా గొప్ప హిందూవాదిని. ఈ భారత దేశం హిందువు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు..ఇలా అందరిదీ. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశాన్ని ముక్కలు చేయడాన్ని ఆపేయాలి. దేశమంతా శాంతిని నెలకొల్పాలి. దేశం అభివృద్ధి శాంతితోనే సాధ్యం"
- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ
బీజేపీపై విమర్శలు..
20 ఏళ్లలో బీజేపీ సిద్ధాంతాల్లో చాలా మార్పులు వచ్చాయని విమర్శించారు దిగ్విజయ్ సింగ్. ప్రతి చోటా అవినీతి జరుగుతోందని మండి పడ్డారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణంలోనూ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఆలయ నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు సేకరించారని, ఇప్పటి వరకూ వాటి లెక్కలు చెప్పలేదని అన్నారు. రూ.2కోట్ల విలువ చేసే భూమిని రూ.20 కోట్లు పెట్టి కొన్నారని ఆరోపించారు. బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చినప్పుడు మొదలైన ఈ రగడ..ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా...మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇదే విషయమై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడితే RSSని బ్యాన్ చేస్తామని మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. అదే జరిగితే కాంగ్రెస్‌ని బూడిద చేసేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
Also Read: ఇష్టమొచ్చినట్టు సిమ్ కార్డులు కొంటామంటే కుదరదు, కొత్త రూల్స్‌తో కేంద్రం వార్నింగ్