(Source: ECI/ABP News/ABP Majha)
Tarin Journey: రైలులో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి-లేకుంటే టికెట్ రద్దైనట్టే!
Indian Railway: రైలులో ప్రయాణించే వాళ్లు తప్పనిసరిగా ఐడీ ప్రూఫ్‌తో వెళ్లాలి. టికెట్ పరిశీలనకు వచ్చినప్పుడు ఐడీ ప్రూఫ్ మ్యాచ్ కాకుంటే టికెట్ కొననట్టే పరిగణింపబడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
Train Commuters Should have ID Proof: ఇక నుంచి రైలు ప్రయాణం చేసే వాళ్లు టికెట్‌తో పాటు ఐడీ ప్రూఫ్‌ను కూడా తీసుకెళ్లాలి. ప్రయాణికుల దగ్గర రైల్వే శాఖ నిర్దేశిత గుర్తింపు కార్డులు లేకుంటే వారు టికెట్ తీసుకున్నా తీసకోననట్టే పరిగణించడం జరుగుతుందని విజయవాడ డివిజన్ అధికారులు స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా టికెట్ల బదిలీలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఐడీ ప్రూఫ్ చూయించకుంటే టికెట్ తీసుకోనట్టే:
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్‌పోర్టు వ్యవస్థల్లో ఒకటి. ఈ గిగాంటిక్ వ్యవస్థ కొన్ని ప్రత్యేకమైన నిబంధనల ద్వారా ప్రయాణికులకు చక్కటి ప్రయాణ అనుభూతి కల్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకోసం ఆ నియమనిబంధనలు తప్పనిసరిగా ప్రయాణికులు పాటించాలని రైల్వే అధికారులు పదేపదే స్పష్టం చేస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి.. ప్రయాణికులు తప్పని సరిగా ఐడీ ప్రూఫ్ కలిగి ఉండడం. రైలులో ప్రయాణించే వాళ్లు ఇకపై టికెట్‌తోపాటు ఐడీ ప్రూఫ్‌కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక వేళ వేరే ఏ కారణాలతో ఐనా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి సదరు గుర్తింపు కార్డులు చూపించకపోతే టికెట్ కొననట్టే పరిగణించి చర్యలు తీసుకుంటామని విజయవాడ డివిజన్ అధికారులు పేర్కొన్నారు. బుకింగ్ సమమంలో ఇచ్చిన వివరాలకు, రైలులో ప్రయాణించే వారి వివరాలకు సరిపోలక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అనధికారిక ప్రయాణాలు, టికెట్ బదిలీలు నిరోధించి ప్రయాణికులకు తమ ప్రయాణం సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని చెప్పారు. ఇకపై విజయవాడ డివిజన్ పరిధిలో రైలులో ప్రయాణించే వాళ్లు ఇకపై టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఒక ఐడీ ప్రూఫ్ తీసుకు రావాలని అధికారులు తెలిపారు.
ఏఏ ఐడీ ప్రూఫ్‌లు పరిగణలోకి తీసుకుంటారంటే..?:
రైల్వే శాఖ దాదాపు 11కి పైగా గుర్తింపు కార్డుల జాబితాను విడుదల చేసింది. వీటిలో ఏదో ఒకటి ప్రయాణికులు తమతో పాటు తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్ కార్డు, రేషన్ కార్డు, విద్యాసంస్థలు విద్యార్థులకు ఇచ్చే గుర్తింపు కార్డులు, ఏదైనా నేషనల్ బ్యాంక్ పాస్ బుక్, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, జిల్లా యంత్రాంగం, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, బార్ కౌన్సిళ్లు జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమతో పాటు తెచ్చుకొవాలని అధికారులు సూచించారు. టీటీఈ వచ్చినప్పుడు టికెట్‌తో పాటు వీటిలో ఏదో ఒకటి చూపించకపోతే ఆ టికెట్ పరిగణనలోకి రాదని హెచ్చరించారు.
ప్రయాణం రద్దైతే టికెట్ బదిలీ చేయొచ్చా?
ముందుగానే టికెట్ట్ బుక్ చేసుకొని అనుకోని కారణాల వల్ల ప్రయాణం రద్దైతే ఆ టికెట్‌ను కొన్న వ్యక్తికి ఆర్థిక నష్టం కలగకుండా రైల్వేశాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ టికెట్‌ను కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బదిలీ చేసే అవకాశం కల్పించింది. కుటుంబస సభ్యుల్లో.. తల్లి దండ్రులకైనా, భార్యకైనా, భర్తకైనా, తోబుట్టువులకు, కుమార్తెకు లేదా కుమారుడికి బదిలీ చేయొచ్చు. అయితే దీని కోసం రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరకు ఎవరికైతే బదిలీ చేయాలనుకుంటున్నారో వారి ఐడీ ప్రూఫ్‌తో వెళ్లి బదిలీ ప్రక్రియను ఆథరైజ్డ్‌గా చేయించుకోవాలి. తద్వారా అన్‌ఆథరైజ్డ్ బదిలీలకు అడ్డుకట్ట పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.