(Source: ECI/ABP News/ABP Majha)
PM E-DRIVE: ఎలక్ట్రిక్ వాహనం కొనడమే కాదు చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినా కేంద్రం సాయం- ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా?
PM E-DRIVE: పీఎం ఈ డ్రైవ్ పథకం ఈరోజు నుంచి అమలులోకి వస్తోంది. 2026 మార్చి 31 వరకు ఇది అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనం కొన్నా చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినా కేంద్రం సాయం చేస్తుంది.
PM E-DRIVE: రాబోయేది అంతా ఎలక్ట్రానిక్ వాహనాల యుగమే. ఇప్పటికే కొత్తగా టూవీలర్స్ కొనాలనుకుంటున్న చాలామంది ముందుగా ఎలక్ట్రిక్ వాహనాల(EV) గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. నచ్చకపోతే ఆ తర్వాతే పెట్రోల్ వేరియంట్ కోసం వెళ్తున్నారు. ముఖ్యంగా తక్కువ పరిధిలో తిరిగే అవసరం ఉండి, చార్జింగ్ పెట్టుకోడానికి వెసులుబాటు ఉన్నవారు కాస్త రేటెక్కువైనా ఎలక్ట్రిక్ వాహనాలవైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇంధన చార్జీలు భారీగా పెరిగిపోవడం, కరెంటు రేట్లతో పోల్చి చూస్తే ఖర్చు మరీ ఎక్కువగా ఉండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడుతున్నారు. ఒకరకంగా ఇది దేశానికి కూడా మంచిదే. ఇంధన దిగుమతులను కట్టడి చేయొచ్చు. అదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదార్లకోసం కొత్త స్కీమ్ అమలులోకి తెచ్చింది. దీనిపేరు పీఎం ఈ డ్రైవ్(PM E-DRIVE). పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్ హాన్స్ మెంట్ అనేది దీని పూర్తి రూపం. ఇప్పటికే ఉన్న పాత పథకానికి మార్పులు చేర్పులు చేసి దీన్ని సిద్ధం చేశారు. ఈరోజు (అక్టోబర్-1) నుంచి ఇది దేశవ్యాప్తంగా అమలులోకి వస్తోంది.
గతంలో ఇలా..
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఫేమ్-1(FAME-1) పథకాన్ని తీసుకొచ్చింది. రూ.795 కోట్లతో 2015 ఏప్రిల్-1 ఫేమ్-1 ని ప్రారంభించారు. రెండేళ్ల పాటు అమలు చేశారు. ఆ తర్వాత 2019 ఏప్రిల్-1 ఫేమ్ -2(FAME-2) అమలులోకి వచ్చింది. దీనికోసం రూ.11,500 కోట్లు కేటాయించారు. ఈ పథకం 2024 మార్చి 31 వరకు అమలులో ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్(EMPS) ని కొత్తగా ప్రవేశ పెట్టారు. దీనికోసం రూ.778 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు కొత్తగా పీఎం ఈ డ్రైవ్ ని తెరపైకి తెచ్చారు. ఇక్కడినుంచి దాదాపు రెండేళ్లపాటు అంటే 2026 మార్చి 31 వరకు ఇది అమలులో ఉంటుంది.
ఈ పథకం ప్రత్యేకతలేంటి..?
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల పట్ల ప్రజలు ఆసక్తి చూపించేందుకు పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే ప్రభుత్వం రాయితీ ఇస్తుందనమాట. అంతే కాదు, ఎలక్ట్రానిక్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది. మొత్తంగా ఈ స్కీమ్ కోసం కేంద్రం రూ.10,900 కోట్లు కేటాయించింది. ఎలక్ట్రిక్ వాహనాలకోసం ప్రచారం, తయారీదారులకు పన్ను రాయితీలు, కొనుగోలు దారులకు ధరలపై డిస్కౌంట్లు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. ఈ స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఇ-అంబులెన్స్ లు, ఇ-ట్రక్కులకు సబ్సిడీపై ఇస్తారు. ఇ-బస్సులకోసం రూ.4,391 కోట్లు, టూవీలర్ల కోసం రూ.1,772 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
ఈ ఏడాది డిసెంబర్ నుంచి తయారయ్యే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో 50 శాతం విడిభాగాలను లోకల్ గా తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఇక కొనుగోలుదారుల రాయితీ విషయానికొస్తే బండి సామర్థ్యాన్నిబట్టి డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ కొనుగోలు చేస్తే కిలోవాట్ కి రూ.5000 డిస్కౌంట్ ఇస్తారు. ఆ తర్వాతి ఏడాది ఆ డిస్కౌంట్ రూ.2500కి పరిమితం అవుతుంది. అంటే డిస్కౌంట్ కోసమైనా ఈ ఏడాది చాలామంది టూ వీలర్స్ తీసుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఇ-రిక్షాకు ఈ ఏడాది రూ.25వేలు రాయితీ ఇస్తారు. ఆ తర్వాతి ఏడాది దాన్ని రూ.12500కి తగ్గిస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రజల్లో వాటి వాడకం పట్ల అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Also Read: “హార్న్ ఓకే ప్లీజ్” వెనుక ఇంత కథ ఉందా? మహారాష్ట్రలో ఈ పదాన్ని బ్యాన్ చేయడానికి కారణం తెలుసా?