Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
Nagarkurnool News: సీఎం రేవంత్ సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. సీఎం సోదరుల వల్లే మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Kondareddypally Ex Sarpanch Forceful Death: సీఎం రేవంత్ స్వగ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో లభ్యమైన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'సీఎం సోదరుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నా.' అని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా వంగూరు మండలంలో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి (Kondareddy Pally) చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి (85) కల్వకుర్తిలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణమే దీనికి కారణమని సమాచారం. పశు వైద్యశాల వెనుకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా.. ఆయన ఇంటికి దారి లేకుండా ప్రహరీ గోడ నిర్మించారనే వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన సాయిరెడ్డి కల్వకుర్తి వచ్చి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన సాయిరెడ్డి కొండారెడ్డిపల్లి గ్రామానికి 2 దఫాల్లో 13 ఏళ్ల పాటు సర్పంచ్‌గా ఉన్నారు. గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా పని చేశారన్న పేరు సాయిరెడ్డికి ఉంది. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
'బెదిరించి కొట్టారు'
తన తండ్రి బెదిరించి కొట్టారని.. అందుకే ఆయన మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాయిరెడ్డి కొడుకు మాధవరెడ్డి ఆరోపించారు. 'మా ఇంటికి పోకుండా గోడ అడ్డం కడుతుంటే మా నాన్న చాలా బాధపడ్డారు. ఊర్లో గ్రామ పంచాయతీ వారు వంగూరు పోలీసులను తీసుకొచ్చి ఆయన్ను కొట్టారు. ఇన్ని రోజులు బెదిరించి ఇప్పుడు చచ్చే వరకూ తెచ్చారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం మా నాన్నను బెదిరించారు. సూసైడ్ నోట్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఏమో.? మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. వాళ్లను ఎదిరించి మేం బతకలేం.' అని చెప్పారు.
సూసైడ్ నోట్ వైరల్
కాగా, ఆత్మహత్యకు ముందు మృతుడు సాయిరెడ్డి రాసిన సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సైతం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సూసైడ్ నోట్ గమనించిన కొంతమంది దాన్ని ఫోటో తీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
'సీఎం సోదరులు చేసిన హత్య'
అటు, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. 'ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య. 6 నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో.. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టారు. సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్‌గా ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి, 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేకే చివరికి పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్‌లో చాలా స్పష్టంగా సీఎం బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలి. రాష్ట్రంలో సీఎం, ఆయన సోదరుల అరాచకాలకు అంతే లేకుండా పోయిందని స్పష్టమవుతోంది. ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన.' అని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read: Crime News: గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!