(Source: ECI/ABP News/ABP Majha)
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
YSRCP: వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను జగన్ తో పాటు శాసనమండలి చైర్మన్ కు పంపించారు.
Jayamangala Venkataramana has resigned from the post of MLC of YCP party: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.ఆ పార్టీకి , ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీకి చేసిన రాజీనామా లేఖను జగన్‌కు..ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు పంపించారు. తన రాజీనామాలను ఆమోదించాలని ఆయన లేఖల్లో కోరారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజకవర్గానికిచెందిన జయమంగళ వెంకటరమణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఓడిపోయారు. ఓ సారి పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయిస్తే పని చేశారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత మల్లీ ఆయనకు కైకలూరు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఆయనకే అక్కడ టిక్కెట్ వస్తుందని అనుకున్నారు. అయితే పొత్తులు కుదిరితే తనకు సీటు ఉండనది ఆయన ఫీలయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సిన జగన్ దృష్టిలో పడ్డారు. బీసీ మత్స్యకార వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ వల్ల ఉపయోగం ఉంటుందని ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసి పార్టీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్సెల్సీగా అవకాశం ఇచ్చారు.
Also Read: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
వైసీపీ ఎమ్మెల్సీగా ఆయన ఇటీవల శాసనమండలి సమావేశాలకు కూడా హాజయ్యారు. అయితే వైసీపీ ఘోరపరాజయం పాలైనప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చివరికి పాత పార్టీ టీడీపీతో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. తిరిగి పార్టీకి రావాలంటే పదవికి కూడా రాజీనామా చేయాలని షరతు విధించడంతో ఆ మేరకు పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఇంకా ఐదేళ్లకుపైగా పదవీ కాలం ఉంది. ఇటీవలి కాలంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల్లో జయమంగళ వెంకటరమణ నాలుగోవారు.
ప్రస్తుతం పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, సుంకర పద్మశ్రీలు ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామాలు చేశారు. కానీ వారి రాజీనామాలు చేశారు. మండలి చైర్మన్ ఆమోదించలేదు. తమ రాజీనామాలు ఆమోదించాలని వారు పదే పదే శాసనమండలి చైర్మన్ ను కోరుతున్నా నిర్ణయం తీసుకోవడం లేదు వైసీపీ తరపున ఎవరు రాజీనామా చేసినా మళ్లీ ఆ పదవి వైసీపీకి వచ్చే అవకాశం లేదు. ఒక వేళ తాము చేరబోయే పార్టీ అంగీకరిస్తే రాజీనామా చేస్తున్న ఎమ్మెల్సీ పదవులు వారికే వస్తాయి. లేకపోతే మరో పదవి కోసం వేచి చూడాల్సిందే.
పదవి ఇచ్చారు కానీ పవర్ ఇవ్వలేదన్న జయమంగళ
అధికార పార్టీలో ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఏమి సేవ చేయలేకపోయానని జయమంగళ వెంకటరమణ అంటున్నారు. కనీసం పోలీసులకి ఫోన్ చేయాలన్న స్వతంత్రం లేదని పదవి అయితే ఇచ్చారు గాని పవర్ ఇవ్వలేదన్నారు. 23 సంవత్సరాలు టిడిపిలో ఉండి కొల్లేరు ప్రజల కోసం వైసీపీలోకి వచ్చాను వైసీపీలో కూడా ఏమీ చేయలేకపోయాననన్నారు. ఏదైనా సమస్య కోసం వైసీపీ ప్రభుత్వాని కోరితే సజ్జలతో మాట్లాడు ధనుంజయ గారితో మాట్లాడు అనడమే తప్ప ఏ పని జరగలేదన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా కొల్లేరు ప్రజలకి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని.. .ఏ పార్టీలోకి వెళ్ళేది నా ప్రజలతో మా నాయకులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతానన్నారు. సమస్యల గురించి మాట్లాడదామని వెళితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదుని ఆరోపించారు.