Manik Saha : ఉత్కంఠకు తెర, త్రిపుర సీఎంగా మాణిక్ సాహా- మార్చి 8న ప్రమాణస్వీకారం
Manik Saha : త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా పేరు ఖరారు అయింది. మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.
Manik Saha : త్రిపుర ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్ష్ కు తెరపడింది. బీజేపీ అధిష్ఠానం త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా పేరు ఖరారు చేసింది. త్రిపుర ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అధిష్ఠానం సూచనతో మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ శాసనసభా పక్షం రెండోసారి ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను ఎన్నుకుంది. బుధవారం నూతన ముఖ్యమంత్రి, కొత్త మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
Tripura | Manik Saha has been elected as legislative party leader by BJP MLAs. He will be the CM of the state.
— ANI (@ANI) March 6, 2023
(File Pic) pic.twitter.com/ItKNX1VI3k
మాణిక సాహా వైపే అధిష్ఠానం మొగ్గు
70 ఏళ్ల మాణిక్ సహా గత ఏడాది త్రిపుర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సాహా స్థానంలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌ని నియమించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. కానీ బీజేపీ అధిష్ఠానం మాణిక్ సాహా వైపే మొగ్గుచూపారు. త్రిపురలో విజయం సాధించిన మరుసటి రోజే ముఖ్యమంత్రి పదవికి మాణిక్ సాహా తన రాజీనామాను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న, 60 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఫలితాలు వెలువడ్డాయి. ప్రాంతీయ పార్టీ తిప్రమోర్తా 13 స్థానాలను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. CP(M)-Congress కూటమి 15 స్థానాలు గెలుచుకుంది. అయితే అధికార బీజేపీ 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి)కి ఒక స్థానాన్ని కేటాయించింది.
ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని
మార్చి 8న జరగనున్న సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బీజేపీ త్రిపుర ధ్యక్షుడు రాజీబ్ భట్టాచర్జీ ఇదివరకే వెల్లడించారు. త్రిపురలో కొత్త సర్కార్ ఏర్పాటు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం మార్చి 8వ తేదీన నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కార్యక్రమానికి హాజరు కానున్నారు. దేశం నలువైపుల నుంచి ప్రజలు త్రిపురకు వచ్చి సంతోషంగా హోలీ ఆడతారని భట్టాచర్జీ చెప్పారు. బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి త్రిపుర రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చింది. భారత ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ దాదాపు 39 శాతం ఓట్లను సొంతం చేసుకోగా 32 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. త్రిపుర మోత పార్టీ 13 సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. గతంలో రాష్ట్రంలో కంచుకోటగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 11 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లకు పరిమితమైంది. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక్క సీటు గెలిచింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. త్రిపురలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం అగర్తలలోని వివేకానంద మైదానంలో నిర్వహించనున్నారని పీటీఐ పేర్కొంది.