Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దక్కని ఊరట - ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు, విచారణ వాయిదా
Supreme Court: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ పై ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 29 తర్వాత విచారణ చేస్తామని తెలిపింది.
Supreme Court Key Orders On Kejriwal Petition: ఢిల్లీ లిక్కర్ పాలసీకి (Delhi Liquor Policy) సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. దీనికి సంబంధించి ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో తన అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ సవాల్ చేస్తూ కేజ్రీవాల్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఈడీ చర్యలను న్యాయస్థానం సమర్థించింది. ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సోమవారం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24లోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది. దీనిపై ఏప్రిల్ 29 తర్వాత విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court asks ED to file its response on or before April 24. Supreme Court posts the plea of Kejriwal on the week commencing from April 29.
— ANI (@ANI) April 15, 2024
Senior advocate Abhishek Manu Singhvi appearing for Kejriwal tells the Supreme Court that the arrest was made to disable him from… https://t.co/ngPlXoH0zb
కస్టడీ పొడిగింపు
అటు, రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఆయనకు ఏప్రిల్ 23 వరకూ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు.
Delhi excise policy case: Court extends CM Arvind Kejriwal's judicial custody until April 23
— ANI Digital (@ani_digital) April 15, 2024
Read @ANI Story | https://t.co/R7rU5e80q6#ArvindKejriwal #ExcisePolicyCase #judicialcustody pic.twitter.com/hFVRpTVuvE
కాగా, లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కొన్ని రోజుల పాటు ఆయన్ను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు ఏప్రిల్ 15 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తన అరెస్టుపై సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తాజాగా ఆ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్ట్ చేసిందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని.. ఆయన అరెస్టును సమర్థించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 'సీఎంకు ఓ న్యాయం, సామాన్యులకో ఓ న్యాయం అనేది ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు. నిందితుడి వీలుని బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు.' అని పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.