Rajya Sabha Polls 2022: భార్యను పక్కన పెట్టిన అఖిలేశ్ యాదవ్- కీలక నిర్ణయం!
Rajya Sabha Polls 2022: ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరిని తమ పార్టీ తరఫున రాజ్యసభ బరిలో నిలపాలని ఎస్‌పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆలోచిస్తున్నారు.
Rajya Sabha Polls 2022: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల ఉమ్మడి రాజ్యసభ అభ్యర్థిగా జయంత్ చౌదరి పేరు ఖరారు చేశారు. అయితే ఈ అభ్యర్థిత్వాన్ని తన భార్య డింపుల్ యాదవ్‌కు ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇందుకు భిన్నంగా జయంత్ చౌదరి పేరు ఖరారు చేశారు అఖిలేశ్.
ముగ్గురు
ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్, జవేద్ అలీ ఖాన్ పేర్లు రాజ్యసభ ఎన్నికల కోసం ఖరారు అయ్యాయి. చివరి అభ్యర్థిగా ఆర్ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరి పేరును ఫైనల్ చేశారు.
జయంత్‌కు తెలీదు
నిజానికి రాజ్యసభకు వెళ్లే అంశంపై జయంత్‌కు ముందస్తుగా ఎలాంటి సమాచారం అఖిలేశ్ ఇవ్వలేదు. అందుకేక తాను ఆ రేసులో లేనని బుధవారం జయంత్ చౌదరి ప్రకటించారు. అయితే గురువారం ఉదయం జయంత్‌కు అఖిలేశ్ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారట.
సమాజ్‌వాదీ పార్టీ పేరుతోనే రాజ్యసభకు జయంత్‌ను పంపాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ఎస్పీ మద్దతుతో ఆర్ఎల్‌డీ సభ్యుడిగానే రాజ్యసభకు వెళ్లాలని జయంత్ ఆలోచిస్తున్నారు. జయంత్ రాజ్యసభ సభ్యత్వం దాదాపుగా ఖరారు అయినట్టే కానీ, ఏ పార్టీ పేరుతో వెళ్తారనేదానికి ఇంకా సమయం పట్టొచ్చని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.
ఎన్నికలు
రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇటీవల షెడ్యూలు విడుదల చేసింది. జూన్ 10న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. 15 రాష్ట్రాలకు సంబంధించిన 57 మంది ఎంపీల పదవీకాలాలు జూన్ 21 నుంచి ఆగస్టు ఒకటి లోపు పూర్తి కానున్నాయి.
ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలున్నాయి. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 11 స్థానాలు, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి 6 స్థానాల చొప్పున ఖాళీ అవుతున్నాయి. పదవీకాలం పూర్తవుతున్న వారిలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, కపిల్ సిబల్, అంబికా సోని తదితరులున్నారు.
Also Read: Domestic Violence Rajasthan: ఇదేం కొట్టుడురా నాయనా! బ్యాట్‌తో కొడితే కోర్టులో పడిన భర్త!
Also Read: Karti Chidambaram: ఒక్క చైనీయుడికి కూడా వీసా ఇవ్వలేదు- ఇవన్నీ బోగస్ కేసులు: కార్తీ చిదంబరం