CNAP Caller ID System:ట్రూ-కాలర్ లాంటి కాలర్ ID సిస్టమ్ తీసుకొస్తున్న ప్రభుత్వం- రెండింటికీ తేడా తెలిస్తే షాక్ అవుతారు?
CNAP Caller ID System:గుర్తు తెలియని నెంబర్ వస్తే వారి పేరు తెలిసే ట్రూకాలర్ లాంటి సరికొత్త వ్యవస్థను ప్రభుత్వం తీసుకురానుంది. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు CNAP వ్యవస్థను పరీక్షిస్తోంది.

CNAP Caller ID System: ఇకపై మీకు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్ వస్తే, నెంబర్‌తోపాటు ఆ వ్యక్తి పేరు కూడా కనిపించేలా సరికొత్త వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇప్పటి వరకు ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఈ పని చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వమే ఈ బాధ్యతను తీసుకుంది. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాళ్లను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాలర్ పేరు తెలుసుకోవడానికి ట్రూకాలర్ వంటి యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం CNAP అనే కొత్త కాలర్ ID సిస్టమ్‌ను తీసుకువస్తోంది, ఇది కాల్ చేసే వ్యక్తిని గుర్తించడం సులభం చేస్తుంది. తెలియని నంబర్ల నుండి కాల్‌లు వచ్చినప్పుడు, నంబర్ మాత్రమే కనిపిస్తుంది, కానీ త్వరలో దానితో పాటు కాల్ చేసే వ్యక్తి పేరు కూడా కనిపిస్తుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దీని పరీక్ష ప్రారంభమైంది.
CNAP అంటే ఏమిటి?
CNAP అంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్. ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన ట్రూ-కాలర్ ధృవీకరించిన వెర్షన్ అని చెప్పవచ్చు. ట్రూకాలర్ వంటి యాప్‌లు క్రౌడ్‌సోర్స్ చేసిన డేటాపై ఆధారపడి ఉంటాయి, అయితే CNAPలో నంబర్‌తో పాటు కాల్ చేసే వ్యక్తి ఆధార్-లింక్డ్ పేరు కనిపిస్తుంది. ఈ సిస్టమ్ తెలియని నంబర్‌లతోపాటు మీ ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్‌లపై కూడా పని చేస్తుంది. అంటే, మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడల్లా, మొదట ఆ నంబర్‌తో లింక్ చేసిన ఆధార్ కార్డ్ పేరు కనిపిస్తుంది, ఆ తర్వాత మీ ఫోన్‌లో సేవ్ చేసిన ఆ కాంటాక్ట్ పేరు కనిపిస్తుంది.
కొత్త సిస్టమ్‌ను ఎందుకు తీసుకువస్తున్నారు?
గత కొంతకాలంగా దేశంలో సైబర్ నేరాలు పెరిగాయి. ప్రజలు మోసాలకు గురవుతున్నారు. మోసాలు, స్పామ్ కాల్‌లను నిరోధించడానికి ఈ వ్యవస్థను తీసుకువస్తున్నారు. CNAP పోర్టల్‌కు గత నెలలో ఆమోదం లభించింది. ఇప్పుడు టెలికాం కంపెనీలు దీన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. థర్డ్ పార్టీ యాప్‌లలో, వినియోగదారులు తమ ప్రొఫైల్‌ను సృష్టించేటప్పుడు తమ ఇష్టం వచ్చిన యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు, కానీ ఇందులో అలా ఉండదు. ఇది నంబర్‌తో లింక్ చేసిన ఆధార్ కార్డ్ నుంచి కాలర్ పేరును తీసుకుంటుంది.
ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి
ఈ వ్యవస్థకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అతిపెద్ద ప్రశ్న గోప్యత, కచ్చితత్వం గురించి. అలాగే, వినియోగదారులు తమ డిస్‌ప్లే పేరును మార్చుకోగలరా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.





















