Reservations in Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల, బీసీల మాటేంటి?
BC Reservations in Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తేలిపోయింది.

Grama Panchayat Reservations in Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదలు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు (G.O.Ms.No.46, తేదీ 22.11.2025) జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ శనివారం జీవో రిలీజ్ చేసింది. దాంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది అధికారికంగా అమలు చేయడం సాధ్యం కాదని తేల్చింది. తెలంగాణ హైకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని తెలిసిందే.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లపై ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని జారీ చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిమితి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లలో రొటేషన్ పద్ధతిలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మార్పుల ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియలో పారదర్శకత మరియు సమాన అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పులన్నీ కమిషన్ నివేదిక ఆధారంగా రూపు దాల్చనున్నాయి.
రోటేషన్ విధానంలో రిజర్వేషన్లు
SC, ST, BC అన్ని కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదు. షెడ్యూల్డ్ ఏరియాల్లో (ST ప్రాంతాల్లో) సర్పంచ్ పదవులు మొత్తం ఎస్టీలకు రిజర్వ్ చేయాలి. జనాభా ఆధారంగా ST, SC, BC రిజర్వేషన్లు ఇతర ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్లు రిపీట్ అవకుండా రోటేషన్ విధానంలో అమలు చేయాలి. మహిళల రిజర్వేషన్ ప్రతి వర్గంలో (ST/SC/BC/UR) సగం (50 శాతం) ఉండాలి. 2019 తర్వాత కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణించి కొత్తగా నిర్ణయం తీసుకోవాలి.
రిజర్వేషన్లను నిర్ణయించే విధంగా అధికారులకు MPDOలకు: వార్డ్ సభ్యుల రిజర్వేషన్లు,
RDOలకు: సర్పంచ్ రిజర్వేషన్లు బాధ్యతలు ఇచ్చారు.
రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు జనాభా నిష్పత్తి, SEEEPC Survey 2024, 2011 సెన్సస్ వంటి డేటాను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా రిజర్వేషన్, తగ్గిన స్థానాలు, రొటేషన్ అమలు, లాటరీ విధానం మొదలైన వాటిపై స్పష్టమైన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల (నవంబర్) 26 లేదా 27వ తేదీన ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజ్ కావడంతో, ఈ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల వివాదం (బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు అంశం) కారణంగానే ఇప్పటివరకు ఈ ఎన్నికలు ఆలస్యం అవుతూ వచ్చాయి.
వచ్చే వారం ఎన్నికలపై ప్రకటన
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 11వ తేదీన జరగనున్నాయి. ఈ దశలో 4,000కు పైగా గ్రామ పంచాయతీలు, 100 ఎంపీటీసీలు (MPTCs) కవర్ అవుతాయి. ఆ తరువాత, రెండవ దశ ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన నిర్వహించనున్నారు. ఇందులో మరో 4,000 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇక మూడవ, చివరి దశ ఎన్నికలు డిసెంబర్ 17వ తేదీన నిర్వహించనున్నారు. ఇందులో మిగిలిన 4,769 పంచాయతీల ఎన్నికలను పూర్తి చేస్తారు. మొత్తంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 1.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో లక్షకు పైగా అభ్యర్థులు పోటీ పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.






















