ibomma: పాప్ కార్న్ బక్కెట్ నుంచి ఐ బొమ్మ ఆలోచన- పోలీసు కస్డడీలో రవి చెప్పిన సంచలన విషయాలు!
ibomma: పోలీసు విచారణలో ఐబొమ్మ రవి చెప్పే సమాధానాలకు ఖాకీలు సైతం అవాక్కవుతున్నారు. సినీ స్టోరీని తలదన్నేలా ఇమ్మిడి రవి రియల్ స్టోరీ వింటుంటే మతిపోతోంది.

ibomma: ఐబొమ్మను నడిపించిన నిన్ను వదల బొమ్మాళీ అంటూ హైదరాబాద్ పోలీసులు ఇమ్మడి రవిని తమదైన స్టైల్‌లో విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 5 రోజుల పోలీసు విచారణలో భాగంగా రెండో రోజు విచారణ ముగిసింది. రెండు రోజులకే నిందితుడు రవి చెప్పే విషయాలకు పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. ఐబొమ్మ వెబ్ సైట్ ఎందుకు పెట్టాలనే ఆలోచన వచ్చింది. కారణాలేంటి, ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాడు, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది..ఇలా ఒక్కొక్కటిగా ఉన్నది ఉన్నట్లు పోలీసు విచారణలో ఓపెనైపోతున్నాడు ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మిడి రవి. ముఖ్యంగా తన జీవితంలో జరిగిన ఘటనలే, ఐబొమ్మకు ప్రేరణగా నిందితుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
ఐబొమ్మ రవిది ప్రేమ వివాహం. పెళ్లైన కొత్తలో ఓ చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకునే రవి , ఆ సమయంలో సినిమా థియేటర్లు వెళ్లాలంటే వచ్చే జీతం సరిపోయేది కాదట. అందులోనూ సినిమా రిలీజ్ రోజునైతే థియేటర్ వైపు వెళ్లే సాహసం కూడా చేసేవాడు కాదంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. అంతలా థియేటర్లలో టిక్కెట్ ధరలు,లోపల పాప్ కార్న్ బక్కెట్ , కూల్ డ్రింక్స్ ఇలా ఏవి కొనాలన్నా వేలకు వేలు ఖర్చు పెట్టేందుకు వచ్చే జీతం సరిపోయేది కాదట.
పెళ్లైన కొత్తలో భార్య తనను రిలీజ్ సినిమాకు తీసుకెళ్లమని ఒత్తిడి చేసేదట, కానీ బడ్జెట్ సరిపోకపోవడంతో సినిమాను థియేటర్లలో చూడటం సాధ్యం కాని పరిస్థితి ఉండేది. ఇదే విషయంలో అనేక సార్లు భార్యకు రవికి మధ్య గొడవలు జరిగేవట. కనీసం రిలీజ్ రోజు సినిమా థియేటర్‌కు తీసుకెళ్లలేవు. పాప్ కార్న్ కొనివ్వలేవంటూ అవమానకరంగా భార్య మాట్లడేదట. ఈ మాటలు రవిని తీవ్రంగా బాధించేవట. భార్య భర్తలు విడిపోయిన తరువాత కూడా ఆమె అన్న ఈ మాటలు రవి చెవులకు వినిపిస్తూనే ఉండేవట. అలా సినీ థియేటర్లపై కసి పెంచుకున్న ఇమ్మిడి రవి, సినిమా రిలీజ్ రోజే ఐబొమ్మ ద్వారా పైరసీ వెబ్ సైట్ అందుబాటులోకి తేవాలని ఫిక్స్ అయ్యాడట. అలా భార్య చేసిన అవమానంతో ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఏకంగా 21వేల సినిమాలను ఇప్పటివరకూ పైరసీ చేశాడు.
ఇమ్మిడి రవి చూట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ఇప్పటికే ఇమ్మడి రవిపై ఏకంగా 10సెక్షన్ల క్రింద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఐటీ యాక్ట్, BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇలా తీగ లాగితే పైరసీ డొంక మొత్తం కదిలేలా పోలీసు విచారణ కొనసాగుతోంది. తాజాగా ప్రహ్లాద్ అనే వ్యక్తి వద్ద పాన్ కార్డు, ఆర్ సీ బుక్, బైక్ లైసెన్స్ తీసుకోవడంతోపాటు ఫోర్జరీకి పాల్పడినట్లుగా గుర్తించడంతో ఫోర్జరీ కేసు సైతం నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
నిఖిల్ అనే స్నేహితుడి బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. వీటితోపాటు ఇప్పటికే రవికి చెందిన 6 బ్యాంక్ అకౌంట్లను గుర్తించడంతోపాటు ఆయా అకౌంట్ ల ద్వారా జరిగిన లక్షల రూపాయల నగదు లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు. ఇటీవల కరేబియన్ సిటిజన్ షిప్ పొందేందుకు ఏకంగా 85లక్షలు ఖర్చుపెట్టినట్లుగా తాజా విచారణలో తేలడంతో , అక్కడ రవికి సహకరించిన వారి వివరాలను సైతం లాగేపనిలోపడ్డారు పోలీసులు. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సైతం పాల్పడినట్లు గుర్తించడంతోపాటు, క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై దృష్టిసారించారు.





















