WhatsApp Down: వాట్సాప్ డౌన్‌పై ఐటీ శాఖ రియాక్షన్- రిపోర్ట్ ఇవ్వాలని మెటాకు ఆదేశం
WhatsApp Down News: వాట్సాప్ సర్వర్ మంగళవారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం 12 గంటల నుంచి డౌన్ అయింది. రెండు గంటలకుపైగా సేవలు ఆగిపోయాయి.
IT Ministry On WhatsApp Outage: వాట్సాప్ సర్వర్ డౌన్ కావడంపై మెటా నుంచి నివేదిక ఐటీ మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ మంగళవారం (అక్టోబర్ 25) భారతదేశంతో సహా అనేక దేశాలలో డౌన్ అయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు మెసేజ్‌లు పంపలేకపోయారు. తాము లాగిన్ కూడా అవ్వలేకపోయామంటూ వినియోగదారులు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
వినియోగదారులు ప్రొఫైల్ ఫొటోలు కూడా మార్చలేకపోయారు. సమాచారాన్ని కూడా పంపుకోలేకపాయారు. డౌన్ అయిన టైంలో ఫోన్ నంబర్ మార్చడం కూడా సాధ్యం కాలేదు. వినియోగదారులు చాట్ హిస్టరీని కూడా బ్యాకప్ చేయలేకపోయారు. వాట్సాప్ పని చేయక పోవడం వల్ల గ్రూప్, వ్యక్తిగతంగా కూడా మెసేజ్‌లు పంపలేకపోయారు.
కంపెనీ ప్రకటన
ఈ సేవను తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. "కొంతమంది వ్యక్తులు సందేశాలను పంపడంలో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ను పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాం" అని వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కలిగి ఉన్న మెటా ప్రతినిధి ఒకరు చెప్పారు.
చాలా దేశాల్లో సర్వర్ హ్యాంగ్
భారత్‌తోపాటు పాకిస్తాన్, ఇటలీ, టర్కీకీ చెందిన సోషల్ మీడియా యూజర్లు సందేశాలు పంపలేకపోతున్నామని పోస్ట్ చేశారు. యూకేలో వాట్సాప్ సర్వర్లు కూడా డౌన్ అయ్యాయి. రెండు గంటలకుపైగా అంతరాయం కలిగించిన తరువాత, వాట్సాప్ కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
భారత్ అత్యధిక మంది వినియోగదారులు
అన్ని ఆఫ్షన్స్ పనిచేయడం లేదు. చాలా మంది వినియోగదారులు ఇప్పుడు సందేశాలను పంపగలుగుతున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారు. 2 బిలియన్లకుపైగా వినియోగదారులు కమ్యూనికేషన్లు, చెల్లింపుల కోసం వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా వాట్సాప్ వినియోగదారులు (390.1 మిలియన్లు) ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 5, 2021 తర్వాత వాట్సాప్‌కు అంతరాయం కలగడం ఇదే తొలిసారి.