Wayanad Landslide: : వయనాడును వదలని వాన- మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ- సహాయ చర్యలకు తీవ్ర ఆంటంకం
Land Slide: వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి
Kerala News: కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వయనాడ్(Wayanad) జిల్లాలో కుంభవృష్టిగా వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడి వందమందికిపైగా మృతిచెందగా...సహాయ చర్యలు ముమ్మంగా కొనసాగుతున్నాయి
ప్రకృతి విపత్తు
కేరళ(Kerala)లోని వయనాడు వల్లకాడుగా దర్శనమిస్తోంది. ఎటు చూసినా శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. మట్టిపెల్లలు తొలగించేం కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. భారీ వర్షాలకు మూడు గ్రామాలపై కొండలు చరియలు విరిగిపడటం(Land Slide)తో మూడు ఊళ్లు కనుమరుగయ్యాయి. మొత్తం కొండమట్టి కింద కూరుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉండటంతో సహాయ చర్యలకు తీవ్రం ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు భారీ వర్షాలు మళ్లీ ముంచెత్తనున్నాయన్న వాతావరణశాఖ(IMD) హెచ్చరికలకు కొండప్రాంత వాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ క్షణం ఏ ఆపద ముంచుకొస్తుందోనని కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నారు. మరికొంతమంది బతుకుజీవుడా అనుకుంటూ ఇళ్లు,వాకిలి వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే కేరళ(Kerala)ను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉండటంతో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్(RED Alert), 4 జిల్లాలకు ఆరెంట్ అలెర్ట్ జారీ చేశారు.
సహాయ చర్యలకు ఆటంకం
భారీ వర్షం కురుస్తుండటానికి తోడు, రహదారులన్నీ ధ్వంసంకావడంతో వయనాడులో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే స్థానిక బృందాలకు తోడు ఎన్డీఆర్ఎఫ్(NDRF) సిబ్బంది రంగంలోకి దిగారు. అటు సైన్యం సైతం కదిలి రావడంతో వేగంగా పనులు చేపట్టారు. వాయుసేన విమానాల ద్వారా భారీ యంత్రాలను ప్రమాదం జరిగిన ప్రాంతాలకు తరలించి చకచకా పనులు సాగిస్తున్నారు. ఇంకా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించిన సురక్షిత ప్రాంతాలకు తరిస్తున్నారు. ఇప్పటికీ వర్షం, వరద తగ్గుముఖం పట్టకపోవడంతో కాల్వలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
వయనాడు జిల్లాలోని మెప్పాడి, ముండకై,చురల్‌మల్ గ్రామాలను కొండ చరియలు కప్పేశాయి. అక్కడ ఊరు ఉందన్న జాడలు ఏమాత్రం కనిపిచండం లేదు. కొండ ప్రాంతం కావడంతో చాలామంది చిన్నచిన్న ఇళ్లను నిర్మించుకున్నారు.అవన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టి కింద కూరుకుపోయాయి. రాత్రికి రాత్రే ప్రకృతి ప్రకోపించడంతో నిద్రిస్తున్నవారు నిద్రించినట్లే కన్నుమూశారు. ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ఆధారంగా కనిపించకుండా పోయిన వారి జాడ కోసం వెతుకుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇప్పటికే వందకు పైగా మృతదేహాలు వెలికితీశారు.
Also Read: కేరళ ప్రకృతి విలయానికి 150 మందికిపైగా మృతి- సహాయ చర్యలు ముమ్మరం
రంగంలోకి దిగిన ఆర్మీ
కేరళలో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కేంద్రం ఆర్మీ(Army)ని రంగంలోకి దింపింది.కాలికట్ మిలటరీ బేస్ నుంచి ప్రత్యేక విమానంలో కోజికోడ్‌కు చేరుకున్న విపత్తు బృందాలు తక్షణం సహాయ చర్యలు ప్రారంభించాయి. మరోవైపు మిగ్-17, ధృవ హెలికాఫ్టర్ల(Helicopter) ద్వారా మృతదేహాలను తరలిస్తున్నారు.అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని హెలీకాఫ్టర్‌లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వయనాడుల్‌లో నది పొంగిపోర్లుతుండటంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్లను సిద్ధం చేసింది.
జోరుగా వానలు
వయనాడుతోపాటు కోజికోడ్,త్రిసూర్, పాలక్కడ్ జిల్లాల్లో జోరువానలతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.వంతెనలు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సీఎం పినరయి విజయన్ రద్దు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయ చర్యల్లోనే పాల్గొనాలని ఆదేశించారు. ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
Also Read: కేరళలో ఈ రేంజ్‌లో వరదలకు కారణాలేంటి? కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?
ప్రభుత్వ పరిహారం
బాధిత కుటుంబాలకు కేరళ ప్రభుత్వం ఐదుకోట్ల రూపాయలు పరిహారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కేరళ సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం ప్రకటించారు.