PM Modi: భారత్ అధ్యక్షతన BRICS కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
BRICS Summit 2025 | ఉగ్రవాదంపై పోరాడాలని బ్రిక్స్ దేశాలు పాల్గొన్న సదస్సులో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది మానవాళికి అతిపెద్ద శత్రువని, ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు.

PM Modi at BRICS Summit 2025: బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన దేశ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భారతదేశానికి బ్రిక్స్ అధ్యక్ష పదవి వచ్చినప్పుడు, 'సహకారం, స్థిరత్వం కోసం బలం, ఆవిష్కరణ' అనే కొత్త ఆలోచనతో ముందుకు సాగుతామన్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సు గ్లోబల్ సౌత్ కు ప్రాధాన్యతనిస్తుంది. బ్రిక్స్ అంటే సహకారం, స్థిరత్వం కోసం స్థితిస్థాపకత. సరికొత్త ఆవిష్కరణలు చేయడం’ అని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి, డబ్ల్యూటీవో లాంటి ప్రపంచ సంస్థలు కాలం చెల్లినవిగా పేర్కొన్న మోదీ.. అవి ఈ శతాబ్దానికి పనికి రావన్నారు.
భారతదేశంతో బ్రిక్స్ కు కొత్త గుర్తింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారతదేశ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ సౌత్ కు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రపంచంలో సహకారం, బలం, స్థిరత్వాన్ని ప్రోత్సహించే కొత్త లక్ష్యాన్ని సిద్ధం చేస్తుంది. ఇది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు కేంద్రం బ్రిక్స్ సదస్సు. కొన్ని దేశాలు వాతావరణ మార్పులను కేవలం గణాంకాల్లో చూస్తున్నాయి. భారతదేశం మాత్రం దానిని తన సంస్కృతిలో భాగం చేసుకుంది.
భారతదేశానికి వాతావరణ న్యాయం అనేది ఒక ఎంపిక కాదు, నైతిక బాధ్యత. ఎందుకంటే పర్యావరణం, మానవుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో భవిష్యత్తు గురించి కనిపించే ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉండాలి. కోవిడ్19 మహమ్మారిని గుర్తుంచుకోవాలి. ఈ సంక్షోభం, వైరస్ వీసాతో రాదు. పరిష్కారాలు పాస్ పోర్ట్ చూసి ఎన్నుకోబడవని మహమ్మారి మనకు నేర్పించిందని’ అన్నారు.
చిన్న దేశాల గొంతు బలంగా వినిపిస్తుంది
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలలో చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలను గొంతుక వినాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ పేర్కొన్నారు. అందరికీ సమాన హక్కులు, భాగస్వామ్యం లభించాలని భారత్ సమర్థిస్తుందని అన్నారు. సమావేశంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై కూడా చర్చించారు. ఈ సాంకేతికత కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకుండా అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని మోదీ అన్నారు.
ఉగ్రవాదంపై మోదీ సందేశం
నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం నేడు మొత్తం మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాని మోదీ ప్రస్తావించారు. ఇది కేవలం భారతదేశంపై జరిగిన దాడిగా కాకుండా మొత్తం ప్రపంచంపై జరిగిన ఉగ్రదాడి దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి డబ్బు, శిక్షణ లేదా ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి ద్వంద్వ వైఖరి ఉండరాదు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిక్స్ దేశాలకు ప్రధాని మోదీ, భారత్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఉగ్రవాదంపై అంతా ఏకం కావాలి..
ఉగ్రవాదంపై ఇంకా సహనం చూపించవద్దని, టెర్రరిజంపై పోరాటం కేవలం భారతదేశానిది మాత్రమే కాదు, ఇది మొత్తం ప్రపంచ దేశాల బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు.






















