Onion Price Hike: కేంద్రం కీలక నిర్ణయం, ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధింపు - ప్రజలకు ఊరట
Indian Govt Imposes 40% Export Duty On Onion: కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని 40 శాతంగా నిర్ణయించారు.
Export Duty On Onion In India:
కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని 40 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎగుమతి పన్ను అమలులో ఉండనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. ఇటీవల టమాటా ధరల పెంపును గమనించిన ప్రభుత్వం ఉల్లిపాయల విషయంలో జాగ్రత్త పడింది. ఎగుమతి సుంకం పెంపుతో దేశంలో ఉల్లి సరఫరా పెరిగితే, ధరలు అదుపులో ఉంటాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు ఉల్లి ధరల నుంచి ఊరట కలగనుంది.
ఎగుమతులు అధికం కావడం, దేశంలో సరఫరా తగ్గిపోతే ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో ఉల్లి ధరల పెరుగుదల ఉంటుందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. ఇటీవల బియ్యం ధరలను నియంత్రించడంలో భాగంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించడం తెలిసిందే. ఈ నిషేధం అమెరికా లాంటి దేశాల్లో ప్రభావం చూపింది. ఉల్లి ధర కొన్ని వారాలుగా పెరుగుతూ వస్తోంది. ఆగస్టు చివరి నాటికి రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. తక్కువ సమయంలో ఉల్లిపాయ కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని పీటీఐ గత వారం రిపోర్ట్ చేసింది.
To improve the domestic availability of onions, Government of India imposes 40% export duty on onions with immediate effect upto 31st December 2023 pic.twitter.com/WXccIciBIk
— ANI (@ANI) August 19, 2023
క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్, విశ్లేషణ ప్రకారం ధరల పెరుగుదల, నియంత్రణ చర్యలను గెజిట్ నోటిఫికేషన్ లో ప్రస్తావించింది.
డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోతే ద్రవోల్బణానికి దారితీసి, ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ ఇటీవల పేర్కొంది. సెప్టెంబరు నెలలో తొలి వారం నుంచే ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే నెల తొలివారానికే ఉల్లి కేజీ రూ. 60-70కి కానుందని.. ఈ రేట్లు 2020లో నమోదైన గరిష్ట ధరల కంటే కొంచెం తక్కువగా ఉంటాయని రిపోర్ట్ చేసింది.
రబీ సీజన్ తగ్గిపోవడంతో ఉల్లి ఉత్పత్తిపై ప్రభావం చూపింది. మరోవైపు మార్కెట్లో సెప్టెంబర్ లో తగ్గాల్సిన ఉల్లి సరఫరా ఈ ఏడాది ఆగస్టులోనే మొదలైంది. దాంతో కేంద్రం ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు ఎగుమతి సుంకం నలభై శాతం విధించింది. ఈ జులై నెలలో టమాటా సృష్టించిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రభుత్వం రంగంలోకి దిగి పలు రాష్ట్రాల్లోల సబ్సిడీకి టమాటాను రైతు బజార్లలో విక్రయించేందుకు చర్యలు తీసుకుంది.
ఆర్‌బిఐ గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆగస్టులో టమాటా ధరలు పెరిగాయని పేర్కొంది. ఉల్లి, బంగాళదుంపల ధరలు పెరిగాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అక్టోబర్ నెలలో కొత్త పంట వచ్చేంత వరకు ధరలు పెరగకుండా చూడాలని, కొన్ని ప్రాంతాలలో ఉల్లిని బఫర్ స్టాక్ నుంచి విడుదల చేస్తున్నట్లు ఆగస్టు 11న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇ-వేలం, ఇ-కామర్స్ తో పాటు సంఘాలు, రిటైల్ అవుట్ లెట్స్ ద్వారా ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. కేంద్రం ప్రస్తుతం 3 లక్షల టన్నుల వరకు నిల్వచేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి (PSF) కింద ఉల్లిపాయలను అందించనుంది.