Manipur Violence: మణిపూర్‌లో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు, మూడు నెలలు గడిచినా దొరకని ఆచూకీ
Manipur Violence: మణిపూర్‌లో హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం 30 మంది అదృశ్యమైనట్టు సమాచారం.
Manipur Violence:
30 మంది అదృశ్యం..!
మణిపూర్‌లో హింస మొదలైనప్పటి నుంచి కనీసం 30 మంది అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లిపోయారో అన్న సమాచారం లేదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇవి కేవలం ప్రాథమిక లెక్కలు మాత్రమే. ఇలా మిస్ అయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు బాధితులు. వాళ్ల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతుకుతున్నారు. ఇప్పటికీ ఎవరి జాడా కనిపించ లేదు. ఇలా అదృశ్యమైన వారిలో ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. జర్నిలిస్ట్ ఫ్రెండ్ కూడా కనిపించకుండా పోయాడు. వీళ్లిద్దరి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఎక్కుడున్నారో ట్రేస్ చేయడానికీ వీల్లేకుండా పోయింది. మిస్సింగ్ కంప్లెయింట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా ఏ ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటి వరకూ 6 వేల జీరో FIRలు నమోదయ్యాయి. ఓ తండ్రి జాడ కోసం కొడుకు వెతకని చోటు అంటూ లేదు. "నాన్న లేకుంటే మేమైపోతామో" అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ బాధితుడు. ఇలా చాలా మంది తమ సొంత వాళ్లను పోగొట్టుకున్నారు. "మా కుటుంబాన్ని పోషించడానికి నాన్న చాలా కష్టపడ్డాడు. నేను ఇస్రోలో సైంటిస్ట్‌గా పని చేయాలని కలలు కన్నాడు. ఇప్పుడు నాన్న కనిపించకుండా పోయాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు" అని ఓ కొడుకు తండ్రిని తలుచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. కొందరైతే "మా వాళ్లు చనిపోయి ఉంటారు. కనీసం మృతదేహాలనైనా అప్పగించండి" అని పోలీసులను వేడుకుంటున్నారు.
కిడ్నాప్ చేస్తున్నారా..?
ఓ 17 ఏళ్ల బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కోచింగ్ క్లాస్‌కి బైక్‌పై వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఇద్దరి జాడ తెలియలేదు. వేరువేరు పోలీస్ స్టేషన్‌లలో వాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరి ఫోన్‌లూ స్విచ్ఛాఫ్ అయినట్టు పోలీసులు వివరించారు. ఇది కేవలం రెండు మూడు కుటుంబాల సమస్య కాదు. చాలా మంది ఇలానే తమ వాళ్ల కోసం పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎలాగోలా గడుపుతున్నారు. వాళ్లను కిడ్నాప్ చేసి ఎవరైనా చిత్రహింసలు పెడుతున్నారేమో అని భయపడుతున్నారు కొందరు. ఇలా కనిపించకుండా పోయిన వారిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంఫాల్‌లోని హాస్పిటల్స్‌లో మార్చురీలో వాటిని ఉంచారు. ఆ డెడ్‌బాడీస్‌ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
సుప్రీం ప్రశ్నలు..
మణిపూర్ అంశంలో సుప్రీం ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారో చెప్పాలని ఆదేశించింది. అసలు ఈ వీడియో బయటకు వచ్చేంత వరకూ ఏం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది. వీడియో బయటకు వచ్చి 14 రోజులవుతోందని, ఇప్పటి వరకూ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తిస్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించింది.
Also Read: Super Moon In August 2023: ఆకాశంలో అద్భుతం- ఆకట్టుకున్న సూపర్ మూన్