(Source: ECI/ABP News/ABP Majha)
NCPతో మాది రాజకీయ మైత్రి మాత్రమే, దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు
Devendra Fadnavis: అజిత్ పవార్‌తో బీజేపీ ఎందుకు చేతులు కలిపడంపై దేవేంద్ర ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Devendra Fadnavis:
అజిత్ పవార్‌పై ఫడణవీస్ కామెంట్స్..
మహారాష్ట్ర రాజకీయాలు ఇటీవలే కీలక మలుపు తిరిగాయి. NCPకి చెందిన అజిత్ పవార్ ఉన్నట్టుండి ఆ పార్టీని వీడి బీజేపీతో చేతులు కలిపారు. అధికారంలో ఉన్న శిందే ప్రభుత్వంలో కలిసిపోయారు. ఆయనకి డిప్యుటీ సీఎం పదవిని అప్పగించింది బీజేపీ. ఎన్నో ఏళ్లుగా ఎన్‌సీపీలో కీలక పాత్ర పోషిస్తున్న అజిత్ పవార్ బయటకు రావడం సంచలనం సృష్టించింది. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య మాటల యుద్ధానికీ దారి తీసింది. ఈ పరిణామాలపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని విమర్శించారు. తమ పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే వాళ్లందరికీ ఆహ్వానం లభిస్తుందని తేల్చి చెప్పారు.
"ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. కానీ..మా పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు మాలో చేరినా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరింది మా పార్టీకి బలం చేకూర్చడానికే. ఏక్‌నాథ్ శిందే కూడా ఇదే ఉద్దేశంతో వచ్చారు"
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం
ఎన్‌సీపీలో చీలికలు వచ్చినప్పటి నుంచి బీజేపీకి ఆ పార్టీ మధ్య ఘర్షణ మొదలైంది. ఈ విషయంలో బీజేపీ కొంత అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. దీనిపైనా ఫడణవీస్ స్పందించారు. అజిత్ పవార్ తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పార్టీలే ఇప్పుడు విపక్ష కూటమి పేరుతో ఒక్కటయ్యాయని విమర్శించారు ఫడణవీస్.
"అజిత్ పవార్ రావడం వల్ల మాకెలాంటి ఇబ్బంది లేదు. చాలా సంతోషంగా ఉన్నాం. మా కార్యకర్తల గురించి మాకు తెలుసు. ఎవరూ అసంతృప్తితో లేరు. శివసేనతో మా పొత్తు సహజం. కానీ ఎన్‌సీపీతో ఉన్నది మాత్రం పూర్తిగా రాజకీయ మైత్రి. ఎన్‌సీపీ కూడా వచ్చే పదేళ్లపాటు మాతో ఉంటే...అప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా బీజేపీతో ఎప్పటికీ కలిసే ఉండేందుకు అవకాశం లభిస్తుంది"
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం
అజిత్ పవార్ ఈ మధ్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం పదవిలో కొనసాగుతానో తెలియదన్నారు. పుణెలోని బారామతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్థిస్తున్నానన్నారు. అయితే రేపు ఆ స్థానంలో ఉంటానో ? లేదో ? మాత్రం కచ్చితంగా చెప్పలేనన్నారు. అజిత్ పవార్ వ్యాఖ్యలు చూస్తుంటే...మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ పొత్తు ఎక్కువ కాలం కొనసాగేలా లేదని అర్థమవుతోంది. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా ముంబైలో పర్యటించారు. ఈ సమావేశానికి అజిత్ పవార్ హాజరుకాలేదు. ముందు నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా వెళ్లలేకపోయినట్లు తెలిపారు. ఎన్నికలయ్యాక నాలుగుసార్లు ప్రమాణ స్వీకారాలు జరగ్గా మూడుసార్లు అజిత్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్